ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: సమాజంలో ముదిరాజులపై జరుగుతున్న అనచివేత, జాతి వెనుకబాటు అంశాలను సామాజిక కోణంలో ఆలోచించి ప్రతి ముదిరాజ్ బిడ్డ అవగాహనతో ముందుకు రావలసిన అవసరం ఉందని ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుగారి నర్సింహులు ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యా అవకాశాలకు దూరమైన ముదిరాజులకు బిసి-ఎ రిజర్వేషన్, జీవో.15 ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయంగా రావాల్సిన హక్కులను సాధించుకోవడం కూడా కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణలలో పాపమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజుల పక్షానే కాదు, భవిష్యత్తులో మిగిలిన బహుజనుల పక్షాన కూడా తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సమితి నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అహంకారపూరిత ధోరణిని, విభజించి పాలించే తీరును ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు. కేవలం బీసీ 15 కులాలకు మాత్రమే లక్ష రూపాయల సాయం ప్రకటించి ఓటు బ్యాంకు రాజీకీయాలతో బీసీల్లో చీలికలు తెచ్చేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. న్యాయంగా రావాల్సిన హక్కులను సాధించుకోవడం కూడా కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణలో పాపమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.




