మిస్సింగ్‌… ‌కనబడుట లేదు !

జనారణ్యంలో నడుస్తున్నా
వెతుకుతున్న మనిషితనపు
ఆత్మ ఆనవాళ్లు కనిపించక
అయోమయంలో తల్లడిల్లే నాకు
మనిషి స్థిరచిరునామా కావాలి

అందరూ అసలు రూపం దాచి
కొత్త ముసుగేదో తగిలించుకుని
ఎవరికీ ఆనవాళ్లు అందకుండా
ఏదో రహస్య మిషన్‌ ‌పూర్తి చేసే
అగంతకులుగా సంచరిస్తున్నారు

సాటి మనిషిపట్ల సానుభూతి కరువై
కళ్లముందు కనిపించే దుర్మార్గాలను
కనిపించక ఎదురయ్యే అన్యాయాలను
చూడనట్టు పట్టనట్టు ప్రక్కనుంచి
తప్పుకుంటూ ఎక్కడికో ఈ పరుగులు

మనం బాగానే ఉన్నాం కదా
మనకెందుకు పక్కన జరిగే ప్రతీది
అనుకునే అజ్ఞానంలో అమాయకత్వంతో
రేపావహించే అంధకారంలో తామూ
బందీలం కాక తప్పదని తెలుసుకోలేక
స్వార్థంతో మనిషి మాయమై పోతున్నాడు

మిస్సింగ్‌…‌మిస్సింగ్‌
‌మనిషినే వాడు ఎక్కడా
కనబడటం లేదని ప్రకటన ఇవ్వాలి
మనిషిని మనిషి గుర్తించేదాకా
కళ్ళు మనసు రెప్పలు తెరచి
మనిషితనం మీద జరిగే దాడులను
మనిషిని మత్తులో ముంచే రాజకీయాన్ని
వ్యవస్థను దిగమింగే దుష్ట శక్తుల్ని
ఎదిరించి ఎండగట్టే మనుషుల
జాడకోసమే నా నిరీక్షణ !
– డా. కె. దివాకరా చారి, 9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *