హైదరాబాద్, జూలై 19 : ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ గతరాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ’మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కావటం విశేషం. ఆ సినిమా పెద్ద హిట్ అవటమే కాకుండా, రచయిత శ్రీరమణకి, దర్శకుడు తణికెళ్ల భరణికి మంచి పేరు తీసుకు వచ్చింది. పేరడీ రచనలకు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా, అలాగే సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణకి మంచి పేరుంది. ఆయన ’పత్రిక’ అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా కూడా ఉన్నారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఎస్ పి బాలసుబ్రమణ్యం, లక్ష్మి ’మిథునం’ సినిమాలో నటించారు, ఈ కథ కేవలం రెండు పాత్రలపైనే ఉంటుంది. అసలు పేరు వంకమామిడి రాధాకృష్ణ లేదా రమణగా పేరుంది.
1952, సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం అనే గ్రామంలో జన్మించారు. స్కూల్ రోజుల నుండే రమణ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. వేమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. అప్పుడే, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. రమణకి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, వరసగా ఆరేళ్ళు ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. అలాగే రమణ పన్నెండేళ్ళ వయసులో వున్నప్పుడు విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది. శ్రీ రమణ అనేది అయన మార్చుకున్న పేరు. బాపట్లలో వారి తాతగారి ఇంట వుండి కాలేజి ఆఫ్ ఆర్టస్ అండ్ సైన్సెస్లో పియుసిలో చేరారు.
అయితే తాతగారికి ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు. అప్పుడు రమణ గారిని దత్తత తీసుకున్నారు. అప్పటివరకు వంకమామిడి రాధాకృష్ణ గా వున్న అతను దత్తత తీసుకున్నాక పేరు కామరాజు రామారావుగా మారింది. రెండు పేర్లు, రెండు ఇంటి పేర్లు ఎందుకు అందరికీ గందరగోళం పెట్టడం అని ’శ్రీ రమణ’ గా మార్చుకున్నారు. శ్రీ రమణ రచనలో తెలుగుదనం ఉంటుంది, తియ్యదనం ఉంటుంది. చాలా పత్రికలలో రమణ పేరడీలు, శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి శీర్షికలు నిర్వహించారు. ’మిథునం’ కథని ఎంతో నచ్చి, మెచ్చి ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు తన స్వీయ దస్తూరితో ఈ కథని రాసి రమణకి పంపారు. కొన్ని నెలల క్రితం ’మిథునం’ సినిమా నిర్మాత ఎం ఆనంద రావు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా రచయిత రమణ కాలం చేసి, సినిమా ప్రేక్షకులను, సాహితీ ప్రియులను విషాదంలో ముంచెత్తారు.



