సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తిసామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు . సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భరత ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆశయంతో ఉన్నవాడికి అధికారం అప్పజెప్పితే అభివృద్ధి చేసి చూపెడతాడని నమ్మిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం చేయి చేయి కలిపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు . గత దశాబ్ద కాలంగా తెలంగాణ సెంటిమెంటుతో పాలకులు సాగించిన విధ్వంసాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ వందరోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకోన్నారు .గతంలో కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే సంభాషించుకునే భిన్న వర్గాల ప్రజలు నేడు తమ భావాలను, హక్కులను, నిరసనలను స్వేచ్ఛగా ఏ వేదిక ద్వారా అయినా పంచుకుంటున్నారు. కష్టమొస్తే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి నేరుగా సచివాలయం లోని మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు నేరుగా వెళ్లి తమ గోడును చెప్పుకునే స్వేచ్ఛను కల్పించింది ఈ ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళ ,శుక్రవారం రోజుల్లో మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో పిటిషన్లను తీసుకొని వాటిని పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అనే భావనను మర్చిపోయిన ఉద్యోగస్తులు ఇప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వస్తుండడంతో సంబరమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఆత్మగౌరవమే ఆలంబనగా బతికే తెలంగాణ సమాజానికి రాచరిక ఆనవాళ్లు చేరిపివేత మానసిక సంతోషాన్ని కలిగించింది..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి ,సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం .అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలను పూర్తి చేసుకొని మిగతా వాటిని కూడా సాధ్యమైనంత తొందరలో అందించాలని కృత నిశ్చయంతో ఉన్నది . టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేసి అసంపూర్తిగా మిగిలిపోయిన ఖాలీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ కు సిద్ధమవుతుంది.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి సారధ్యంలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో గతంలో ఎన్నడు లేని విధంగా 40232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి వైబ్రేంట్ తెలంగాణ -2050 నినాదంతో హైదరాబాద్ నగర అభివృద్ధి మరియు విస్తరణకు మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించడంతోపాటు లండన్ లోని థేమ్స్ నది ,సబర్మతి రివర్ ఫ్రంట్ మాదిరిగా మూసి రివర్ ఫ్రంట్ పేరుతో మూసి నది పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ఖ్యాతి గాంచిన కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థ డోసన్ డూ సన్ 5000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది.
డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పడంతో పాటు రాష్ట్రంలోని యువతలో పారిశ్రామిక అవసరాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించేందుకు మరియు నైపుణ్య ఉద్యోగాలను సాధించేందుకు టాటా టెక్నాలజీస్ తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్ష మందికి ఈ విధానం ద్వారా ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తుంది. రాష్ట్ర క్లుప్త నామాన్ని టీఎస్ నుంచి టిజీ మార్చడం ద్వారా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో కలిగించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది.రాష్ట్రంలోని ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక రాజకీయ స్థితిగతులు శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడానికి కుల గణన చేపట్టడం ద్వారా సులభతరం అవుతుందని భావించి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ద్వారా దీనిని ఆమోదించడం జరిగింది.
గత ప్రభుత్వం విద్యకు సంబంధించి కులాలకు ,మతలకు వేరువేరుగా గురుకులాలను ఏర్పాటు చేయడం ఓటు బ్యాంకు కుల రాజకీయాలు చేయడంతో పాటు కులాలు ,మతాల మధ్య గోడలను ఏర్పాటు చేసి సామాజిక వైవిధ్యాలను, వాటి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో కష్టంగా మార్చింది.కానీ ఈ ప్రభుత్వం కులాలకు అతీతంగా మండల స్థాయిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు పూనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం, ఫెడరల్ వ్యవస్థలో మంచి సంప్రదాయం కానీ గత పాలకులు రాజకీయ దురంకార ప్రయోజనాలతో ఈ సంప్రదాయానికి తూట్లు పొడవడం జరిగింది. ప్రధానిని రాష్ట్రానికి బడే బాయ్ అని సంభోదించడాన్ని విమర్శిస్తున్న కొందరి చర్యలను గుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదిగా భావించవచ్చు. కేంద్రంతో తెలంగాణ సంబంధాల పునరుద్ధరణ ద్వారా అనతి కాలంలోనే అనేక ప్రయోజనాలు సిద్ధించాయి. ఎంతోకాలంగా పెండిరగ్లో ఉన్న రక్షణ శాఖ భూములు బదలాయింపు జరిగి ఎక్స్ ప్రెస్ ఎలివేటెడ్ క్యారిడార్ కు మార్గం సుగమగమైంది.
సర్ ప్లస్ బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర గోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయం.
మేడిపండు లాంటి మేడిగడ్డ బాగోతంపై కాగ్ రిపోర్టు , నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలపై కూడా గత పాలకులు అవాకులు చవాకులు మాట్లాడడం నిజంగా విడ్డూరం. తాజాగా ప్రకటించిన విద్యుత్ పంపిణీ సంస్థల ర్యాంకింగ్లో మన మన విద్యుత్ పంపిణీ సంస్థలు చివరి స్థానంలో నిలవడం గమన హారం. గత ప్రభుత్వం చెప్పుకుంటున్న విద్యుత్ వెలుగుల వెనక ఉన్న చీకటి వెలుగులను బయటకు తీయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యత స్వేచ్ఛ పాలను అందించాలని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆశిస్తూ….
-డాక్టర్ చల్ల ప్రభాకర్ రెడ్డి
(ప్రిన్సిపాల్)





