సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. పంచభూతాలలో ఒకటిగా, భారతీయ సంస్కృతిలో భూమి భూదేవతగా భావించబడి, పూజింప బడడం కనిపిస్తుంది. భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా, కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగా హన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోం చి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న ‘ధరిత్రి దినోత్సవం’ జరుపు కుంటున్నారు. … 1962లో అమెరికన్ సెనెటర్ నెల్సన్‌కి వచ్చి న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. 1969లో నెల్సన్ మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ తన మిత్రులకు మరియు ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్స వం జరిగింది. ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించు కునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచ వ్యాపితమైంది.
వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి. జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి. దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆలివర్ డి షుట్టర్ గుర్తించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని నివేదించారు. వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలకపాత్ర వహించింది అమెరికా. ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం విశేషం. 50 ఏళ్ల క్రితం ఏప్రిల్ 22న గేలార్డ్ నెల్సన్ నేతృత్వంలో కాలుష్యకారక విధానాలకు నిరసనగా జనం ఉవ్వెత్తున ఉద్యమించారు. అప్పటి నుంచీ సుస్థిర అభివృద్ధి కోసం ధరిత్రి దినోత్సవం జరుపుకుం టున్నాం.ప్రపంచ వ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అ మితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయుకాలుష్యం పెచ్చు మీరుతోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పది లంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం. తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియో గించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్దే సుస్థిరా భివృద్ధి. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది.
భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. వినియోగ అనుకూల సామర్థ్యాన్ని పెంచాలి.
దూరదృష్టితో తరగని, పునర్వినియోగించు కోగల వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా సౌరశక్తి వినియోగం అధికంగా జరగాలి. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను కనీస స్థాయికి తగ్గించ గలగాలి. అడువుల సంరక్షణ, పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ జరగాలి.. పర్యావరణాన్ని రక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు, వివిధ రకాలైన కాలుష్యాలను నియంత్రించటానికి, అదే విధంగా కాలుష్య దుష్ప్రభావాలను తగ్గించటానికి వివిధ చట్టాలను అమలు చేస్తున్నాయి. అదే విధంగా మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణ చర్యలకై పలు చట్టాలను రూపొందించి అమలు జరుపుతున్నది. భారత ప్రభుత్వం 1981వ సంవత్సరంలో ‘‘వాయుకాలుష్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1986వ సంవత్సరంలో ‘‘పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ, బూడిద, విషవాయువులు వంటి వాటిని ఫిల్టర్లతో వడపోసి మాత్రమే వాతావరణంలోకి వదలాలి.
ఇటువంటి పరిశ్రమలను, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణురియాక్టర్ల వంటి వాటిని జనుల నివాసాలకు దూరంగా కట్టాలి. రైళ్ళు, వాహనాలు వంటి వాటికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు కాకుండా జీవ ఇంధనాలు వాడేలా చూడాలి. దీనివలన ఎంతో వాయు కాలుష్యం తగ్గుతుంది. మొత్తం పరిశ్రమలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నాలుగు తరగతులుగా విభజించింది. ఆయా పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాలను అనుసరించి అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే వాటిని ఎరుపు వర్గంగాను, మధ్యస్తంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నారింజ వర్గంగాను, తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే వాటిని ఆకుపచ్చ వర్గంగా, కాలుష్యానికి ఆస్కారమివ్వని వాటిని తెలుపువర్గంగా వర్గీకరించింది.
తెలంగాణలోని పరిశ్రమలన్నింటినీ కాలుష్య నియంత్రణ మండలి క్రమబద్ధంగా పర్యవేక్షిస్తోంది. ఈ పరిశ్రమలు ఎటువంటి కాలుష్యాన్ని విడుదల చేయకుండా చూస్తూ, ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలకు ఉపక్రమిస్తున్నది. అలాగే అడవులను, పర్యావరణాన్ని రక్షించేందుకు ఇతర చర్యలతో పాటు, అతి ముఖ్యమైన తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికపై కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రభుత్వాలు ఎదో చేయాలని మిన్నకుండి పోకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
(నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం)
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494




