మాంసం దుకాణాల బంద్‌ ఉత్తర్వులపై స్టేకు నిరాకరణ

  • జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు
  • విచారణ 28కి వాయిదా
    హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేలాలను మూసివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలు నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈలోగా జీహెచ్‌ఎంసీ తమ వాదనలతో కూడిన కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి గురువారం మరోసారి విచారించారు. జీహెచ్‌ఎంసీకి ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా ఈ నెల 4న ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ గోపాల్‌ వాదించారు. జీహెచ్‌ఎంసీలోని 533 (బి) నిబంధన ద్వారా కమిషనర్‌ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదన్నారు. పశువుల వధశాలలు, మాంసం దుకాణాలను మూసివేయాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై జీహెచ్‌ఎంసీ తరఫు స్టాడిరగ్‌ కౌన్సిల్‌ స్పందిస్తూ,పిటిషనర్‌ మాంసం తినరని, మాంసం విక్రయం కూడా చేయరు కాబట్టి పిటిషన్‌ దాఖలు చేసే అర్హత లేదన్నారు. అనాదిగా ఆగస్టు 15న మాంసం విక్రమాలపై నిషేధం కొనసాగుతోందన్నారు. వాదనలపై స్పందించిన న్యాయమూర్తి పిటిషనర్‌ కావాలంటే ముందుగానే మాంసాన్ని కొనుగోలు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని ఆ రెండు రోజులు తినొచ్చునని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వుల అమలు నిలిపివేతకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *