వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా…
పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు
రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా
మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా
కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం
కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు
కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు
బిఆర్ఎస్ ప్రభుత్వ వేసిన చిక్కుముళ్లు విప్పుకుంటూ ముందుకు..
30 వేల ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా కల్పించాం
పాలమూరు బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సిఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహిం చిన ’పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని తాను ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటానని, తాను కూడా సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని అన్నారు. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని, ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చామని, ఆయితే అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్టాల్రు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని అన్నారు. కేటీఆర్, హరీష్ రావును చూస్తే.. బిఆర్ఎస్ ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుందని, పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతానని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
వంశీచందర్‌రెడ్డిని ఎంపీగా, జీవన్‌రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకు పోతుంటే కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నామని, తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని, 11 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని, 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చు కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వం వొస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట అంటూ..ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామనడం.. దేశానికి మంచిదా అనేది విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలని సిఎం అన్నారు. దుర్మార్గమైన రాజకీయాలకు పాతరేయాలని అన్నారు. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా ..అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని, తమ జోలికొస్తే అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నల్లమల నుంచి తొక్కుకుంటూ వొచ్చి కేసీఆర్‌ను రోడ్డుకు ఈడ్చానని, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలని, రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని సీఎం అన్నారు.
ఇకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో అయినా..కేడీతో అయినా కొట్లాడుతానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే ప్రధానితో బహిరంగంగానే ప్రజల తరఫున మాట్లాడానని, వారిలా తలుపులు మూసికుని మాట్లాడ లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎంగా తన బాధ్యత నిర్వర్తించానని, మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టానని సిఎం స్పష్టం చేశారు. దీనిని కూడా కొందరు రాజకీయ పబ్బం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. నిధులు ఇవ్వకపోతే బీజేపీని చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తానని, కేంద్రంతో సంఘర్షణ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రధాని హోదాలో పాలమూరుకు మోదీ ఏం ఇచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక పాలమూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండని కోరారు. 2009లో కేసీఆర్‌ను గెలిపించి లోక్‌సభకు పంపామని, కెసిఆర్ పాలనలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా వొచ్చిందా…అని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరును దేశంలో ఆదర్శ జిల్లాగా ఆభివృద్ధి చేస్తానని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాలమూరు పిల్గగాడు సీఎం అయ్యాడని కేసీఆర్‌లో అక్కసు ఉందని, ఇంట్లో పడితే కేసీఆర్ రెస్ట్ తీసుకోకుండా.. కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడని దుయ్యబట్టారు. 90 రోజుల్లోనే తమ ప్రభుత్వం 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెగా డీఎస్సీతో టీచర్ల నియామకానికి తెరలేపామన్నారు. అలాగే ప్రతి నెలా ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
కాంగ్రెస్ పాలనపై రాష్ట్రమంతా చర్చ జరుగుతుందని, కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని, కార్యకర్తల వల్లే తాము అధికారంలో ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2006లో ప్రజల అండతో జడ్పీటిసి అయ్యానని, 2009, 2014లో కొడంగల్ ఎమ్మెల్యే అయ్యానని, 2018లో మల్కాజిగిరిలో లోక్‌సభ సభ్యుడిని అయ్యానని, నాటి కష్టంతోనే నేను పీసీసీ చీఫ్ అయ్యానని అన్నారు. పాలమూరు బిడ్డలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదిలావేంటే రాష్ట్రంలో మరో 20 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా పాలన ఉందన్నారు. ఏ ఊరుకెళ్లినా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అప్పులకు మిత్తికట్టుకుంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. దేశంఈ స్థితిలో ఉండటానికి కారణం సోనియగాంధీనే అన్నారు. కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పొత్తు పెట్టుకునే పరిస్థితి వొచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. వోట్లడిగే హక్కు బీఆర్ఎస్ నాయకులు కోల్పోయారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశానికి, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి పడిపోయాయని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, చదువులు గాలికిపోయాయని విమర్శించారు. కృష్ణాజలాలపై రాష్ట్రానికి హక్కులు ఇవ్వకుండా కేంద్రం తగవులు పెడుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి వోట్లడిగే నైతిక హక్కు లేదన్నారు.





