మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ప్రకటించలేదని, ఎవరైనా అలా ప్రచారం చేసుకుంటే సహించేది లేదని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి హెచ్చరించారు. మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి కార్యదర్శి యేలిమేటి అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీ ప్లోర్ లీడర్ ఏనుగు జంగా రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశానికి చల్లా నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో కొందరు కావాలని కాంగ్రెస్ టికెట్ మాకు వచ్చిందని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది వారికి అంత మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గానికి టికెట్ ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాటి వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా ప్రకటించలేదన్నారు. ఎవరైనా అలా ప్రచారం చేసుకుంటే, వారి మాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి 8 మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అందరి అభిప్రాయాల మేరకే టికెట్ కేటాయించడం జరుగుతుందన్నారు. కొందరు కావాలని కార్యకర్తలను అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఇదే విషయంపై అధిష్టానం దృష్టికి తీసుకుపోగా, మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఎవరికి కేటాయించలేదని, అందరి అభిప్రాయాల మేరకే టికెట్ కేటాయించడం జరుగుతుందని చెప్పినట్లు చెప్పారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం ఒక వ్యక్తి ఐదు ఏకరాల భూమి, రూ.10 కోట్లు అధిష్టానం పెద్దలకు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మారే వారిని కాకుండా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని అధిష్టానం తప్పకుండా గుర్తించి, తగిన న్యాయం చేస్తుందని దేపా భాస్కర్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని ఉన్న వారికే అధిష్టానం ముందుగా తగిన ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏకతాటిపై నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని కొందరు కావాలని అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ వచ్చినట్లు తప్పుడు ప్రచారం ఆపాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి మున్సిపాలిటి, కందుకూరు, మహేశ్వరం, ఆర్కే పురం, సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




