మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత

  • అనేక కార్యక్రమాల అమలు
  • రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం
  • పాల్గొన్న డిజిపి, ఉన్నతాధికారులు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని  రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అం‌జనీ కుమార్‌ ‌పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణా పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… మహిళా భద్రతపై అమలవుతున్న పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మహిళల్లో  ఆత్మవిశ్వాసం ఏర్పడిందని, మహిళలపై ఏవిధమైన అభద్రతా చర్యలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.  ప్రధానంగా షీ-టీం, భరోసా, సైబర్‌ ‌క్రైమ్‌, ‌మానవ అక్రమ రవాణా నిరోధం, గృహహింస నిరోధం తదితర చర్యలతో యువతులు, మహిళల్లో ఆత్మస్థైర్యం ఏర్పడిందని డీజీపీ చెప్పారు. ఈసందర్బంగా డీజీపీ అంజనీ కుమార్‌ ‌మాట్లాడుతూ,  రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ ‌డీజీ షికా గోయల్‌ ‌మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం ఏర్పాటయ్యిందని  తెలిపారు. 2014లో  షీ-టీం లు, 2016లో భరోసా కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.
దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా పోలీసు నియామకాల్లో 33శాతం మహిళలకు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు.  ప్రజల భాగస్వామ్యంతోనే పటిష్టమైన పోలీసింగ్‌ ‌సాధ్యమని, ఈ నేపథ్యంలో పౌర సమాజం భాగస్వామ్యంతోనే మూడు కమిషనరేట్‌ ‌ల పరిధిలో పెద్దఎత్తున సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. పౌరుల భద్రతకు పోలీసు శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌ ‌నగరం దేశంలోనే సురక్షిత నగరంగా మారిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఇంకా అడిషనల్‌ ‌డీజీలు అభిలాష బిస్త్, ‌స్వాతి లక్రా, డీఐజీ సుమతి, భారీ సంఖ్యలో ఇతర మహిళా పోలీస్‌ అధికారులు, సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *