‘‘జాతీయస్థాయిలో సీటెట్ కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో టెట్ పరీక్షలను కనీసం సంవత్సరానికి రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’ అనే విషయం అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు నిర్లక్ష్యం వహిస్తూ ‘విద్యావ్యవస్థలో విపరిణామాలు’ కలిగిస్తున్నారు అని చెప్పక తప్పదు. ’’
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాకా ఇప్పటి వరకు టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ ( టెట్ ) ని కేవలం మూడు సార్లు ( 2016, 2017 • 2022 ) మాత్రమే నిర్వహించారు. నిజానికి విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం సంవత్సరానికి రెండు పర్యాయాలు ‘ఉపాధ్యాయ అర్హతా పరీక్ష’ని తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. కాని వాస్తవంగా సంబంధిత అధికారులు ఆ విధంగా నిర్వహించడం లేదు. ఈ విషయంలో వారి బాధ్యతారాహిత్యం చాలా సృష్టంగా కనిపిస్తుంది. ‘ఒక్క నిముషం’ నిబంధన పేరిట ఆలస్యంగా హాజరు అయ్యే అభ్యర్థులను అధికారులు వివిధ పరీక్షలకు అనుమతించకపోవడం వంటి ఘటనలు అడపాదడపా అనేకంగా పరీక్షా కేంద్రాలలో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అభ్యర్థులు ‘తమను పరీక్షా హాలులోకి అనుమతించాలి’ అని ఎంతగానో ప్రాధేయపడిననూ కూడా అధికారులు అనుమతించని సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి.
కాని ఈ రకంగా అభ్యర్థులు పరీక్షలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యమైతే అనుమతించని అధికారులు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం వివిధ రకాల పరీక్షలను నిర్వహించడంలో కొన్ని నెలలు, ఏకంగా కొన్ని సంవత్సరాలు ఆలస్యం చేయడం వంటి కళ్ళముందు కదలాడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అలాగే ఉద్యోగులు తమ విధులకు ఏకంగా కొన్ని గంటల పాటు ఆలస్యమైనా కూడా అత్యధిక సందర్భాలలో వారిని ఉన్నత అధికారులు పెద్దగా ఏమి అనరు. పైగా వారికి ఉన్నఫలంగా పూర్తి జీతాలు చెల్లించబడతాయి. ఈ రకంగా అధికారుల అలసత్వ ధోరణులు ఏమాత్రం సమంజసం కాదు. అంటే ఇక్కడ అధికారులకు ఒక న్యాయం మరియు అభ్యర్థులకు మరొక న్యాయం అనేవి పరస్పర విరుద్దాలుగా ఉన్నాయి. ఈ విధానం ఏమాత్రం సరైనది కాదు అని సృష్టంగా చెప్పవచ్చు. ఏదిఏమైనా మొత్తానికి ‘అభ్యర్థులు అనేక రకాల అవస్థలని అధిగమించాల్సి వస్తుంది’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
నిజానికి టెట్ అనేది ఉద్యోగ పరీక్ష కూడా కాదు.అది కేవలం ఒక ‘అర్హతా పరీక్ష’ మాత్రమే. అలాంటి అర్హతా పరీక్షని కూడా అధికారులు నిర్ణీత షెడ్యుల్ ప్రకారం సకాలంలో నిర్వహించలేకపోవడం వారి అసమర్ధతని సృష్టంగా ఎత్తి చూపుతుంది. దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్ ( నెట్) ని ఆయా నిర్వహణా సంస్థలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు (కరోనా కాలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ) నెట్ పరీక్షలను దేశవ్యాప్తంగా సజావుగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాగే జాతీయస్థాయిలో సీటెట్ కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో టెట్ పరీక్షలను కనీసం సంవత్సరానికి రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’ అనే విషయం అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు నిర్లక్ష్యం వహిస్తూ ‘విద్యావ్యవస్థలో విపరిణామాలు’ కలిగిస్తున్నారు అని చెప్పక తప్పదు.
గతంలో 2017 లో టెట్ నిర్వహించిన తర్వాత దాదాపు ఐదు ఏళ్ల అనంతరం 2022, మార్చి 24 నాడు టెట్ ప్రకటనని విడుదల చేశారు. అది కూడా ‘టెట్ ప్రకటనని విడుదల చేయాలి’ అని అభ్యర్థులు దీర్ఘకాలంగా వివిధ రూపాలలో నిరసనలు మిన్నంటే విధంగా చేయడంతో అధికారులు గత్యంతరం లేక చివరికి టెట్ ప్రకటనని విడుదల చేయక తప్పలేదు. అంటే ‘ఐదు ఏళ్లుగా అధికారులు టెట్ ప్రకటనని విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ కాలం గడిపారు’ అనే విషయం చాలా సృష్టంగా అర్థము అవుతుంది. అధికారుల ఈ సంకుచిత ధోరణి ఏమాత్రం సహేతుకం కాదు.
ఐదు ఏళ్ల అనంతరం 2022 మార్చిలో టెట్ ప్రకటనని విడుదల చేసిననూ ‘అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఏ పరీక్షకు ఎన్నడూ చవిచూడని విధంగా కేవలం 18 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం మూలంగా మరియు ఇంకా ఇతరేతర కారణాల మూలంగా దాదాపు లక్ష మందికి పైగా అభ్యర్థులు టెట్ 2022 కి దరఖాస్తు చేసుకోలేకపోయారు’ అనే విషయాన్ని నిర్దిష్ట సమాచారం వెల్లడిస్తుంది. కనీసం దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. నేడు దాదాపు అన్ని పరీక్షలలో కూడా దరఖాస్తులు సరిచేసుకునే సౌలభ్యం ఉంది. కాని అధికారుల అలసత్వం కారణంగా టెట్ 2022 లో ఆ అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయింది. అందువల్ల తప్పులు దొర్లిన అభ్యర్థులు ఏకంగా రెండోసారి దరఖాస్తులు చేశారు.
తత్ఫలితంగా అభ్యర్థులు ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా అదనంగా మరోసారి ఫీజులు చెల్లించారు. ఈ ప్రహసనమంతా అభ్యర్థులకు తడిసి మోపెడు ఆర్థికభారం అయిన విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారుల దుందుడుకు నిర్ణయాల వల్ల టెట్ 2022 కి దరఖాస్తులు సమర్పించుకోలేకపోయిన వారు, అలాగే అర్హత సాధించని వారు మరియు డి.ఇ.డి, బి.ఇ.డి ఉపాధ్యాయ కోర్సులు అభ్యసిస్తూ ఆఖరి సంవత్సరం చివరి దశలు ఉన్న చాత్రోపాధ్యాయులు నేడు మరో టెట్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. 2022 నాటి టెట్ ప్రకటన వెలువడి నేటికి సరిగ్గా పది నెలలు దాటిపోయింది. అందువల్ల సంబంధిత విద్యా శాఖ అధికారులు విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం నిర్ణీత గడువు ప్రకారం మరో టెట్ ప్రకటనని విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. తద్వారా ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా ఎంచుకొని ఆ దిశగా సన్నద్ధం అవుతున్న ‘భావి భారత ఉపాధ్యాయ ఉద్యోగార్ధుల’కు ఎంతగానో మేలు చేకూరుతుంది.
– జె.జె.సి.పి. బాబూరావు, రీసెర్చ్ స్కాలర్, 94933 19690.



