రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: మహిళలకు ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ ప్రయాణం సేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభ సేవలను, పదిలక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ అధికారులతో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ ప్రయాణం భారం కావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత ఆర్టీసీ ప్రయాణం సేవలను ప్రారంభించడం జరిగిందని మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ సేవలు ఎంతగానో మేలు చేస్తాయని మహిళలు ఆర్థిక అభివృద్ధి దిశగా సాగించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ గతంలో ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని పేద ప్రజల ఆరోగ్యానికి పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులు మహిళలు పాల్గొన్నారు.





