- బల నిరూపణ చేసుకోవాలని సిఎం ఉద్దవ్‌కు గవర్నర్ ఆదేశం
- నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
- గౌహతి నుంచి ముంబై చేరుకోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలు
- గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో శివసేన పిటిషన్
ముంబయి, జూన్ 29 : మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. భాజపా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ ఎంట్రీతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. దీంతో శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం గువాహటి నుంచి ముంబయి చేరుకోనున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌ను కోరిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరగడం గమనార్హం.
అయితే బుధవారం ఉదయం తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ముంబయికి చేరుకుంటానని చెప్పారు. అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. దాదాపు వారం రోజులు తర్వాత షిండే వర్గం ఎమ్మెల్యేలు గువాహటి నుంచి బయటికి వచ్చారు. గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించు కున్నారు. మహారాష్ట్ర ప్రజల సంతోషం కోసం ప్రార్థించానని షిండే తెలిపారు. అ సమయంలోనే గురువారం ముంబయి వెళ్తామని ఆయన వెల్లడించారు. బలపరీక్ష నిరూపణకు గవర్నర్ ఆదేశించినా.. అఘాడీ సర్కారు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనపడటం లేదు. బలపరీక్ష నిరూపణను వాయిదా వేసేందుకు న్యాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ..
మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మండిపడ్డారు. బలనిరూపణ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీమ్ కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బలనిరూపణ చట్టవిరుద్ధం అన్నారు. ఇదిలా ఉంటే.. బలపరీక్ష నిరూపణకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో భాజపా తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ బుధవారం సాయంత్రం లోపు ముంబయిలోని తాజ్ హోటల్‌కు రావాలని ఆదేశించింది.అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసన సభ్యులు ఉన్నారు.
ప్రతిపక్షం భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే శిందే తిరుగుబాటుతో.. ఆయన వెంట 39 మంది శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్రులు షిండే వర్గంలో ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 287 మంది సభ్యులున్నారు. శివసేన అసమ్మతి నేతలు 39 మంది గురువారం సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. ఈ క్రమంలో ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమి సంఖ్యా బలం 113 మాత్రమే.
ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు. గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.




