- ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెనక్కి రావాలన్న శరద్ పవార్
- అజిత్ పవార్‌పై శివసేన, శరద్ పవార్ మండిపాటు
- యథాతథంగా బెంగుళూరు విపక్షాల సమావేశం ఉంటుందని స్పష్టం
ముంబై, జూలై 3 : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను వీడి ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపడం మహారాష్ట్ర రాజకీయాల్లో బ్లాక్ డేగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభివర్ణించారు. అవినీతి నేతలు జైల్లో ఉండాలని, కానీ ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరో 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర సర్కార్‌లో మంత్రులుగా కొలువు తీరడంతో ఎన్సీపీలో చీలిక అనివార్యమైంది. మరోవైపు పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది నేతలపై అనర్హత వేటు వేయాలని లేకుంటే వీరు పార్టీ ప్రయోజనాలను పణంగా పెడతారని పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత సహా పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం లేకుండా గుట్టుగా వీరు ఫిరాయింపులకు పాల్పడినందున వీరిపై అనర్హత వేటు తప్పదని కమిటీ తీర్మానించింది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 53 కాగా, వారిలో 9 మంది పార్టీ ఫిరాయించగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ తమతో ఉన్నారని ఎన్సీపీ చీఫ శరద్ పవార్ స్పష్టం చేశారు. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు తాము వారికి అవకాశం ఇచ్చామని, పార్టీలోకి తిరిగిరాని ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని పవార్ హెచ్చరించారు.
బీజేపీ-షిండే శివసేన సర్కార్‌లో అజిత్ పవార్, మరో 8 మంది ఎమ్మెల్యేలు చేరిన అనంతరం అజిత్ పవార్ తనను మోసగించాడని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదని పవార్ అన్నారు. మేము ఇంట్లో రాజకీయాల గురించి చర్చించము. ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు’ అని తెలిపారు. పవార్ సోమవారం ఉదయం సతారా జిల్లాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వాతంత్య ్రపోరాట యోధుడు వైబీ చౌహాన్ స్మారకాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ’నేను నిన్నటి నుంచీ ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పుడు సతారాకు బయలుదేరుతున్నా’ అని చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ చీలిక చర్చనీయాంశమైంది. అయితే, తాజా పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం లేదని పవార్ స్పష్టం చేశారు.
త్వరలోనే బెంగళూరులో ప్రతిపక్ష కూటమి సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఎన్సీపీకి షాక్ ఇచ్చిన పవార్ మేనల్లుడు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతేగా పవార్ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్‌తోపాటు చీలిక వర్గంలో చర్చనీయాంశ మైంది.



