‘మహనీయుల విగ్రహాలు – నిత్య స్ఫూర్తి చిహ్నాలు’. సామాజిక, ఆర్థిక అసమానతలను, దోపిడీ, పీడన అణచివేతలను, దురాచారాలను రూపుమాపేం దుకు పోరాడిన వారు చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారు. అలాంటి త్యాగధనుల కృషిని గుర్తుంచుకోవడం, వారి ఆలోచనా విధానాన్ని కొనసాగించడం సమాజ పురోగతికి చాలా అవసరం. వారి ఆశయాలను ముందుకు తీసుకపోవడానికి, మిగిలిపోయిన పనులను పూర్తి చేసే మార్గంలో పయనించడానికి అవసరమైన తాత్విక పునాదిని వారి పుస్తకాలు, జీవిత చరిత్రలు అందిస్తాయి. వాటి అధ్యయనాన్ని ప్రేరేపించడానికి, నిత్య పోరాట స్ఫూర్తిని రగిలించే స్ఫూర్తి చిహ్నాలు విగ్రహాలు. అడుగులు తడబడినప్పుడు, గమ్యం మరుపు పొరల్లోకి జారుతున్నప్పుడు నూతన ఉదయాన్ని వాగ్దానామిచ్చే ఎర్రని సూర్యోదయం లాంటివి విగ్రహాలు. ఆ విగ్రహాల మౌన ముద్రలో సమాజం అంతులేని ఆదర్శాలను వెతుక్కోవచ్చు. నిద్రాహారాలు లేని వాటి నిరంతర దీక్షలో నిరుపమాన త్యాగాలను ఎత్తిపట్టవచ్చు. ఆ నూతన ఉషోదయాన్ని ప్రతి నిత్యం గుర్తుచేయడానికి, లక్ష్యం వైపు అడుగులను వేగవంతం చేయడానికి, మరిన్ని ఆలోచనలను ప్రోది చేయడానికి, సామాజిక విప్లవకారిణి చదువుల తల్లి సావిత్రి బాయి పూలే విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పూనుకుంది.
సామాజిక అసమానతలను రూపుమాపే అతి ముఖ్యమైన సాధనాలలో విద్య ప్రధానమైనది. అలాంటి విద్యలోనే అసమానతలు పెరిగిపోయిన తరుణంలో సుమారు 180 సంవత్సరాల క్రితమే విద్యను సర్వజనీనం చేయడానికి పూలే దంపతులు చేసిన కృషి, త్యాగం అజారామరం. సమాజంలో వేళ్లూనుకున్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నాటి నుంచి విద్యలో అసమానతలను పాటిస్తుంటే, నేడు ఆర్థిక వ్యత్యాసాలు కూడా తోడైనాయి. నాడు అగ్రవర్ణాలకే విద్య అందుబాటులో ఉండగా, నేడు కొనుక్కోగలిగే వాడికే విద్య దొరుకుతుంది. ఈ అసమానతలను వ్యతిరేకిస్తూ కామన్ స్కూల్ విధానం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ లో ఈ దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటుంది. బ్రాహ్మణీ యతను వ్యతిరేకిస్తూ, బ్రాహ్మణుల్లో బాధితులను ప్రేమించి, వారి అభ్యున్నతికి పాటుపడిన పూలే అడుగుజాడల్లో సమాజం పయనించాలి. మహిళలకు, నిమ్న కులాలుగా ముద్రపడి విద్య నిరాకరించబడిన వర్గాలకు విద్యను అందించడానికి నాటి సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లను ఎదిరించి, ఆచార వ్యవహారాలను ధిక్కరించి సావిత్రి బాయి సామాజిక విప్లవానికి నాంది పలికింది. ఆ ఆదర్శంతో అందరికీ విద్య అనే అందమైన నినాదం వెనుక విద్యకు దూరమవుతున్న గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల పక్షాన పోరాటాలను ఉధృతం చేయాల్సి ఉంది.
పూలే ఆశయాలకు, ఆచరణకు విరుద్ధంగా కుల, మతాల వారీగా గురుకులాల పేరుతో పాఠశాలలను ఏర్పరిచి కులవ్యవస్థను మరింత బలిష్టంగా తయారు చేస్తున్నారు. పూలే, అంబేద్కర్ వంటి సమజోద్దారుకుల పేర్లను ప్రాంతాలకు, భవంతులకు పరిమితం చేసి, వారికి పూర్తి విరుద్ధమైన కార్యాచరణను అమలుచేస్తున్నారు. సంపదలో ఉన్న వర్గ విభజనకు సమాంతరంగా విద్యలోనూ వర్గ విభజన జరిగింది. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, బడా కార్పొరేట్ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయి. కులం, ప్రాంతం, ఆర్థిక స్థోమతలు విద్యార్థుల విద్యా నాణ్యత, స్థాయి, భవిష్యత్తులను నిర్ణయిస్తున్నాయి. సామాజిక, ఆర్ధిక, విద్యారంగ పరిస్థితులు రూపంలో తప్ప సారంలో ఎంతమాత్రం మారలేదు.
ఆనాడు పూలే ఏ అపసవ్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడారో నేడు అవే పరిస్థితులు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఈ అసమానతలను అన్యాయాలను ప్రశ్నించడానికి నేడు గ్రామ గ్రామాన పూలేల అవసరం ఎంతైనా ఉంది. ప్రగతిశీల శక్తులు వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉంది. జోతిబా పూలే, సావిత్రి బాయి పూలేల జీవిత అధ్యయనానికి ప్రేరేపించి వారి ఆశయ సాధనలో నడిచేందుకు నిత్యం స్ఫూర్తిని పొందేందుకు, సమాజానికి వెలుగు దివ్వెలా ఉండేందుకు సావిత్రి బాయి పూలే వర్ధంతి రోజున జరుగుతున్న విగ్రహావిష్కరణ మహోత్సవంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, విద్యాభిమానులు, ప్రజలు పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. విగ్రహాల మౌన ముద్రలో అంతులేని ఆదర్శాలను వెతుక్కుందాం.. రండి. నిద్రాహారాలు లేని విగ్రహాల నిరంతర దీక్షలో నిరుపమాన త్యాగాలను ఎత్తిపడదాం.. రండి. నూతన ఉదయాన్ని వాగ్దానామిచ్చే ఎర్రని సూర్యోదయం లాంటి విప్లవకారిణి విగ్రహావిష్కరణలో భాగమవుదాం.. రండి.
(సావిత్రిబాయి పూలే వర్ధంతి.. నేడుమానుకోటలో విగ్రహావిష్కరణ సందర్బంగా…)
-చుంచు శ్రీశైలం
‘వీక్షణం’ కలెక్టీవ్ సభ్యులు.
టీపీటీఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు.





