మల్కాజిగిరి గెలుచుకునే దమ్ము ఎవరికుంది..

31 లక్షలకు పైగా వోటర్లు ..మినీ ఇండియా గా ప్రసిద్ధి
 ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటలో  గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ విజయం
 ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపీ గా రాజీనామా చేసిన లోక్‌ సభ నియోజక వర్గం

(మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
మల్కాజిగిరి…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్గా మారింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన నియోజకవర్గంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ఒక విధంగా మిని ఇండియాగా పిలువబడుతున్నది. దేశంలోని విభిన్న వర్గాలు, భాషలవారు ఇక్కడ నివసిస్తున్నారు. వీరి మనస్సుదోచుకుని నిలబడే వ్యక్తులెవరా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతున్నది. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటినీ గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు బిఆర్‌ఎస్కు కంచుకోటగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కల్వకుంట్ల తారకరామారావు(కెటిఆర్‌), రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్‌ విసురుతున్నాడు. దమ్ముంటే సిఎం పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో నిలబడమని డిమాండ్‌ చేస్తున్నాడు. అయితే దీనిపైన సిఎం రేవంత్రెడ్డి స్పందించకపోవడాన్ని ఆయన పిరికిదనంగా అభివర్ణిస్తూ, ఇక్కడ బిఆర్‌ఎస్‌ బలాన్ని చూసి రేవంత్రెడ్డి మౌనం వహించారంటూ దెప్పిపొడిస్తున్నాడు.

వాస్తవంగా త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలను  ప్రధాన పార్టీల్కెన కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్తోపాటు బిజెపికూడా సవాల్గా తీసుకున్నాయి. ఈ పార్టీలన్నీ కూడా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పైనే తమ దృష్టిని కేంద్రీకరించడం గమనార్హం. మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరిని  ఎట్టిపరిస్థితిలో గెలుచుకోవాలని బిజెపి గట్టి ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఈటల  రాజేందర్ను నిలబెట్టడమే అందుకు ప్రధానకారణం. ఈటల  గత శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చవిచూసినప్పటికీ ఆయనకే ఆ పార్టీ మరో అవకాశాన్నిస్తూ  మల్కాజిగిరి బరిలో నిలిపింది. ఇక్కడ విచిత్రమేమంటే ఈటలతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థికూడా పూర్వాశ్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులుకావడం. తెలంగాణ ఉద్యమకాలం నుండి, రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఈటల నెంబర్‌ టూగానే ఉండేవాడు. కాని, అధిష్టానంతో ఆయనకు వొచ్చిన విభేదాల  కారణంగా ఆయన బిజెపిలో చేరినప్పటికీ ఆ పార్టీకూడా ఆయనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే వొస్తున్నది.

ఉద్యమకాలంలో ఆయన కార్యదీక్ష, నరేంద్రమోదీపై దేశ ప్రజల్లో పెరుగుతున్న అభిమానం ఈటల గెలపుకు దోహదపడుతుం దనుకుంటు న్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీకూడా ఎట్టిపరిస్థితిలో తన సిట్టింగ్‌ సీటును వదులుకోవొద్దన్న పట్టుదలగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయన మల్కాజిగిరి నియోజవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వొచ్చారు. అందుకే కాంగ్రెస్‌ చేయి జార్చుకోకుండా చూడాలని ఇటీవల రేవంత్రెడ్డి నాయకు లకు కార్యకర్తలకు హితబోధచేశారు. గతంలో తనకిచ్చిన మెజార్టీకన్నా ఎక్కువ మెజార్టీతో పట్నం సునీతా మహేందర్రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సునీతా మహేందర్రెడ్డి నిన్నటివరకు బిఆర్‌ఎస్‌ నాయకు రాలు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్పల్లి జడ్పిటిసీగా ఎన్నికై వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చ్కెర్‌ పర్సన్‌ గా  కొనసాగిన తనను పార్టీలోని కొందరు ఇబ్బందులకు గురిచేస్తే అధిష్టానం పట్టించుకోకపోవడంపైన అలిగి 2024 ఫిబ్రవరి 16న కాంగ్రెస్లో చేరడంతోపాటు, మల్కాజిగిరి పార్లమెంటుకు పోటీచేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆమె భర్త పట్నం మహేందర్రెడ్డికి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రిపదవి సృష్టించి ఇచ్చినప్పటికీ ఆయన కూడా సునీతతోపాటు కాంగ్రెస్లో చేరిపోయారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలచుకున్న బిఆర్‌ఎస్కు ఇప్పుడు పార్లమెంటు స్థానాన్ని గెలచుకోవడమన్నది ఆ  ప్రతిష్ట . గత ఎన్నికల్లో ఇతర జిల్లాల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో బిఆర్‌ఎస్‌ మంచి పట్టు సాధించుకుంది. అందులో భాగంగా మల్కాజిగిరి ఎల్‌ఎస్‌ పరిధిలో ఒక్కటంటే ఒక్కటికూడా ఇతర పార్టీలు గెలుచుకునే అవకాశంలేకుండా చేసింది. అందుకే ఇక్కడ గెలుపు నల్లేరుమీద నడుకే అనుకుంటున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధిష్టానం నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తిచేస్తున్నది. వాస్తవంగా ఈ నియోజకవర్గంలో 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యంలో ఉండిరది. ఆనాడు కాంగ్రెస్‌ ఎంపిగా సర్వే సత్యనారాయణ ఎంపిగా కొనసాగగా, తెలంగాణ ఏర్పడిన 2014లో టిడిపికి చెందిన చామకూర మల్లారెడ్డి ఎన్నికైనారు. ఆయన 2018 వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినా, 2016లోనే కారెక్కారు.

ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎనుముల రేవంత్రెడ్డి ఎన్నికై, తాజా శాసనసభ ఎన్నికల్లో కొడంగల్నుండి ఎమ్మెల్యేగా  గెలుపొంది, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయనే సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగారు. దేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గంగా పేరున్న  31 లక్షలకు పైగా వోటర్లున్న  మల్కాజిగిరిని గెలుచుకోవడం ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. మొదట్లో బిజెపి నరేంద్రమోదీని, కాంగ్రెస్‌ రాహుల్‌ లేదా సోనియాగాధీని ఇక్కడినుండి నిలబెట్టాలని ఆశించాయి. కాని, వారెవరూ ఇక్కడికి రావడానికి సుముఖంగా లేకపోవడంతో స్థానిక నాయకుల మధ్యనే ఇప్పుడు పోరు మొదల్కెంది. ఈ పోరులో మిని ఇండియా విజేతలెవరన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *