మర్రి ప్రవల్లిక కు ప్రగతిభవన్ లో హామీ ఇచ్చిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఇటీవల హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవల్లిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భవనమైన ప్రగతి భవన్ కు పిలిపించుకొని హామీలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకర నరేష్ గురువారం ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చేలా మంత్రి కేటీఆర్ ప్రవల్లిక తల్లిదండ్రులు లింగన్న, విజయతో పాటు సోదరుడు ప్రణయ్ లను ప్రగతిభవనకు పిలిపించుకొని ప్రణయ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని, ప్రతిపక్షాల చిల్లర రాజకీయ ఉచ్చులో పడవద్దని కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి విరుద్ధమని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇవ్వడం తగదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రగతి భవన్ ను ఉపయోగించుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారిక భవనంలో హామీలు ఇస్తున్న కేటీఆర్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్న కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రస్తుత ఎన్నికలలో కేటీఆర్ ను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు సాక్షాధారాలతో  సహా ఫిర్యాదు చేసినట్లు నరేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *