రూట్ బస్సులను మీటింగ్ పంపితే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలి: ఆచారి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి నిత్యం 200పైగా విద్యార్థులు కడ్తాల్ పట్టణానికి పాఠశాలలు, కళాశాలకు వెళుతుంటారు. మహేశ్వరం డిపో అధికారులు రూట్ బస్సును రద్దు చేసి మీటింగ్ లకు పంపుతున్నారు. దీంతో గురువారం బస్సు రాకపోవడంతో విద్యార్థులు మక్తమాధారం గ్రామంలో రహదారిపై విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. డిపో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి విద్యార్థుల ధర్నాలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, గ్రామీణ ప్రాంత బస్సులు రద్దు చేసి అధికార పార్టీ సభలకు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులు తీసుకపోవడం ఏమిటని ప్రశ్ననించారు. విద్యార్థులకు పాఠశాల సమయాల్లో బస్సులు నడపాలని ఆచారి డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులు యాదగిరి, మహేష్, సాయి లాల్, జంగం వెంకటేష్, బ్రహ్మ చారి, బాల్ రాజ్, శంకర్ గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


