మంత్రి కెటిఆర్‌ ‌పర్యటనను ఎబివిపి అడ్డుకునే యత్నం

  • కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు
  • నిరసనల మధ్యే హుజూరాబాద్‌ ‌చేరుకున్న కెటిఆర్‌
  • ‌స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అందని ఆహ్వానం

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 31 : కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. కేటీఆర్‌ ‌ప్రారంభోత్సవం చేసే గెస్ట్ ‌హౌస్‌ ‌వద్ద ఆయన కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు రెండుసార్లు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ ‌జెండాలతో వచ్చిన ఆందోళనకారులు ఆ తర్వాత కాషాయ జెండాలతో  నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులను సిరిసిల్ల జడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌కాలితో తన్నడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కెటిఆర్‌ ‌పర్యటనతో పలువురు నేతలను ముందస్తు అరెస్ట్ ‌చేశారు.

నిరసనల మధ్యే జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ‌పర్యటన కొనసాగుతోంది. హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోని కమలాపూర్‌కు మంత్రి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌కు బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా కమలాపూర్‌ ‌మండలంలో రూ.49 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ నున్నారు. ఎమ్‌జేపీ బాలికల/బాలుర గురుకుల పాఠశాల పనులకు మరికొద్దిసేపట్లో మంత్రి ప్రారంబోత్సవం చేయనున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. కేటీఆర్‌ ‌వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, గంగుల కమలాకర్‌ ఉన్నారు. కేటీఆర్‌ ‌పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్‌ ‌పర్యటన  సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీ లతో ప్రోటోకాల్‌ ‌రగడ చోటు చేసుకుంది.

కమలాపూర్‌లో కేటీఆర్‌ ‌టూర్‌ ‌నేపథ్యంలో భారీగా ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అడుగడుగునా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ ‌రెడ్డి ప్లెక్సీలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. అయితే ప్లెక్సీలలో నియోజకవర్గ ఇంచార్జీ గెల్లు శ్రీనివాస్‌ ‌ఫోటో ఎక్కడా కనిపించని పరిస్థితి. అటు అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు. అధికారిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్‌ ‌ఫోటో లేకపోవడంతో ఫ్రోటో కాల్‌ ‌రగడ నెలకొంది. కమలాపూర్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌సొంత ఊరు కావడంతో అడ్డుకుంటారన్న అనుమానంతో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ‌చేశారు. అరెస్టులపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. కేటీఆర్‌ ‌పర్యటన సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌భద్రతను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *