వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తమై అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీరు నిలవకుండా మురికి కాలువల గుండా నీరు సాఫీగా ప్రవహించేలా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి అందులో ఉన్న నివాసితులను పాఠశాలలు, గ్రామపంచాయతీ భవనాలలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామపంచాయతీ మున్సిపాలిటీ అధికారులకు ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని వంగిన స్తంభాలు, వేలాడే విద్యుత్ తీగలు, ఫెన్సింగ్ లేని ట్రాన్స్ఫార్మర్ ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశుసంపదకు, ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చెరువులు పొంగి పోలుతున్నందున రోడ్లపై నుంచి ఉదృతంగా నీరు ప్రవహించే ప్రాంతాలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పాదచారులు, వాహనదారులు దాటకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటలు కాపలాగా ఉండాలని సూచించారు. అన్ని గ్రామాలలో టామ్ టామ్ నిర్వహించి ప్రజలు తమ ఇండ్ల నుండి బయటకు రాకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఇప్పటికే చెరువులు అన్ని నిండి ఉన్నందున భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగి గండ్లు పడే అవకాశం ఉన్నందున ముందస్తుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ప్రమాదాలను నివారించాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. అధికారులు ఎవ్వరు కూడా సెలవులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపడుతూ ప్రజలు, పశువుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అత్యవసర సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని, 7995061192 ల్యాండ్ లైన్ 08416 – 235291 సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఆర్డీవో లు, గ్రామపంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల ఇంజనీర్ అధికారులు, తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.




