మూడు రోజులుగా దంచి కోడుతున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అనేక వాగులు నిండు కుండల్లామారి సమీప గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో ఆయాగ్రామ ప్రజలు గత రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి ఎక్కి కూర్చున్నారు. పలు నగరాలుకూడా జలమైనాయి. రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో కనీసం నడిచివెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మురిగి కాలువనుండి మురుగంతా రోడ్లపైన, తద్వారా ఇండ్లల్లోకి చేరుకుంటున్నాయి. పలుచోట్ల కిలోమీటర్ల మేర మోకాళ్ళ పైవరకు నీరు నిలిచిపోవడంతో కార్లుకూడా మోరాయిస్తున్నాయి. చాలాచోట్ల కార్లు మునిగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
చెట్లు నేలకొరిగిపోయాయి. పలు పాత ఇండ్లు కూలిపోయాయి. వర్షం భారీగా పడడంతో శిధిలావస్తలో ఉన్న ఇంటిలో పడుకున్నవారు పడుకున్నట్లుగా చనిపోయిన ఘటనలుకూడా చోటు చేసుకున్నాయి. సోమవారం నుండి వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గురువారం కొంత తెరిపి ఇవ్వడంతో ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో జల దిగ్భందానికి గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని సంబందిత అధికారులు చేపట్టారు.
జలదిగ్భందంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ..
మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జలదిగ్భందనలో కూరుకుపోయింది. వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు చుట్టుపక్కలున్న జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా నీటితో నిండిపోయిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. అనేక చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. పలు చెరువు కట్టలు బలహీనంగా ఉండడంతో వాటికి బుంగలు పడి నీరం లీకేజీ అవుతున్నాయి. మరి కొన్ని చెరువులు మత్తడి పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రతీ ఏడాదికన్నా ఈసారి భారీ వర్షాలకారణంగా ప్రజలు ఇండ్లనుంచి బయటిక రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా జనజీవనం స్థంబించి పోయిందనే చెప్పాలే. మంగళ, బుధవారం కురిసిన వర్షాలకు రెండు కుటుంబాలకు చెందిన దాదాపు ఎనిమిది మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువులకు జనం ఇబ్బంది పడ్డారు. కూరగాయలు, పాలు లభించడమే గగనమైపోయింది. ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా మూడు రోజు వర్షానికి అతలాకుతలం అయిపోయింది.
ఇక్కడ అత్యంత ఎక్కువగా వెంకటాపురం మండలం లక్ష్మీపురంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత ఎక్కువ వర్షపాతంగా అధికారులు చెబుతున్నారు. ఇక్కడ 649.8 మిల్లీ మీటర్లుగా నమోదుకాగా ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో 516.5 మి.మీటర్లుగా నమోదు అయింది. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో ఎక్కువగా దెబ్బ తిన్నదికూడా ములుగు జిల్లానే. ఇక్కడ గత మూడు రోజులవర్షాలకు దాదాపు రెండు వందలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు పదికి పైడా ఇండ్లు నేలమట్టంకాగా పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు ద్వంసమైనాయి. ములుగు జిల్లా పరిధిలోని గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి సమీపంలోని గుండ్లవాగు పూర్తిగా నిండిపోయింది. వాగు పక్కనే 163వ జాతీయ రహదారి పైన నిర్మించిన బ్రిడ్జి వద్దనున్న రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ జిల్లాలో దేశంలోనే పెద్ద జాతరగా కొనసాగే మేడారం సమ్మక్క సారలమ్మ దేవతాగద్దెలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ జంపన్న వాగు పోటెత్తుతోంది. గోదావరికి భారీగా నీరు చేరె••కుంటుండడంతో బుధవారం మేడిగడ్డ బ్యారేజీకి సంబందించిన 75 గేట్లను తెరిచారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజీ 59 గేట్లును కూడా తెరిచారు.
ఈ గ్రామం సమీపంలోని పడిగాపురం గ్రామం మొత్తం జలదిగ్భందంలో కూరుకుపోయింది. కాగా వెంకటాపురం శివారులోని మారేడుకొండ చెరువుకు నాలుగువైపుల గండ్లు పడడంతో సమీప ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ ఒక ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులు నిద్రలో ఉండగానే నీటిలో కొట్టుకుపోయారు. ఒకరి శవం లభ్యం కాగా ఇంకా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు పెద్ద కాలువకు గండి పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం జలదిగ్భందానికి గురైంది. చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోకి సుమారు నాలుగైదు అడుగుల ఎత్తున నీరు చేరుకుంది. మోరంచపల్లి వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాఫ్టర్ ద్వారా రెస్కూ సిబ్బంది కాపాడింది. ఇతర గ్రామస్తులను ఆరు బోట్లతో బయటికి తీసుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో మరో ఇద్దరు గల్లంతు అయినట్లు తెలుస్తున్నది. కటాక్షపురం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో హనుమకొండనుండి ములుగు ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్భందంలో వరంగల్ నగరం….
వరంగల్ నగరం గతంలో లేనంత జలదిగ్భందానికి గురైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు 30 కాలనీలకు పైగా నీ• మునిగాయి.. పలు కాలనీల్లోని ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పలు ఇండ్లలో నీరు చేరుకోవడంతో వాటిని కాజీపేట రైల్ స్టేషన్ నీటిలో తేలాడటం ఈసారి వింత్లైన విషయం. రైలు పట్టాలనుండి ప్లాట్ ఫాం మీద దాదాపు రెండు పీట్లవరకు నీరు నిలిచి ఉందంటే ఎంత వర్షం పడిందన్నది అర్థమవుతోంది. దీంతో పలు రైళ్ళను నిలిపేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారిని అక్కడ దించేయడంతో ఎటూ వెళ్ళేందుకు సౌకర్యంలేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తమకు మంచినీళ్ళు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. నగరం విషయానికొస్తే ఏ కాలనీ చూసినా నీటి మయమే. హంటర్‌రోడ్డు, సాయినగర్, ఎన్టీఆర్ నగర్, బృందావన్‌రకాలనీ, సంతోషిమాత కాలనీ, డికె కాలనీ , బిఆర్ నగర్, ఆర్టీఏ కాలని, బట్టల బజార్, పాపయ్యపేట చమన్, పాతబీటు బజార్, రామన్నపేట ముఖ్యంగా సమ్మయ్యనగర్ లాంటి అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఈ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచి పోయాయి.
ఇక్కడి ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కాశికుంట, ఎస్‌ఆర్‌ఆర్ తోట, శాతరాసి కుంట, గాందీనగర్ , గిరిప్రసాద్ నగర్, కాశిబుగ్గ, ఎల్‌బి నగర్ తదిర లోతట్టు ప్రాంతాల పరిస్థితి చాలా బీబత్సంగా మారింది. గోపాపూర్ చెరువు ఆదృతంగా మారటంతో అక్కడ సమీపంలో ఉన్న మధురానగర్, వివేకానంద కాలనీ , సాయి గణేష్‌నగర్, శాంతినగర్ ప్రాంతాలు వరద ముంపుకు గురైనాయి. నగర ప్రధాన రహదారులపైన కూడా నాలాలు పొంగిపొర్లాయి. భగత్‌సింగ్ కాలనీలో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండ నుండి వరంగల్ వెళ్ళే ప్రధాన రహదారిలో అలంకార్ టాకీసు వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని భద్రకాళీ చెరువు మత్తడి పడడం, ములుగు రోడ్డు నుండి దిగువకు నీరు రావడంతో అ ప్రాంతమంతా జలమయమైంది. అధికారుల ఎవరినీ అటు వైపు వెళ్ళ కుండా బారికేడ్స్ పెట్టారు. పలితంగా కాకతీయ ఫెస్ ఒన్, ఫేస్ 2 కాలనీలు నీటిమయమైనాయి. అలాగే హనుమకొండనుండి కాజీపేట మార్గంలో జిల్లా కలెక్టరేట్ దాటిన తర్వాత కూడా రాకపోకలకలు నిలిచిపోయాయి.
కార్లు మునిగేంత నీటిప్రవాహం ఉండడంతో గురువారం సాయంత్రవరకు అటువైపు ఎవరూ వెళ్ళలేని పరిస్థితి. వడ్డెపల్లి చెరువు పొంగి పొర్లుతుండడంతో పింగిలి మహిళా కళాశాల, వడ్డెపల్లి చర్చి, ఆర్టీసి కాలనీ, పరిమిళ, రాంనగర్ కాలనీలు నీటి మయంగా మారాయి. హంటర్‌రోడ్‌లో విపరీతంగా వాన నీరు చేరుకోవడంతో జనజీవన స్థంబించి పోయింది. ఇక్కడ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు బుధవారం నుండి అన్నం నీళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి. గురు వారం సాయంత్రం వారిని గర్తించి బోటు సహాయంతో బయటికి తీసుకువస్తున్న పరిస్థితి. ఇటు హనుమకొండ – కరీంనగర్ రాకపోకలు కూడా నిలిచి పోయాయి. నయింనగర్ బ్రిడ్జి ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్శిటీ ప్రాంతమంతా నీటి మయంగా మారింది. ఇటు వారు అటు, అటు వారు ఇటు వెళ్ళలేని పరిస్థితి. భద్రకాళీ ఆలయం, అయ్యప్పస్వామిగుడిలోకి వరద హోరెత్తింది. సమీపంలోని కాపువాడ వరదమయమైంది. అమృతా టాకీస్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఒక వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని వద్ద ఊరచెరువు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. ఉదయంనుండి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. నగరంలోని పలు అపార్టు మెంట్‌ల్లో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని సెల్లార్‌లలో నీరునిండడంతో జనం భయపడిపోతున్నారు. తాగునీరు లభించక రోజంతా మినర్ వాటర్‌లకోసం జనం ఎగబడ్డారు.




