రాహుల్ గాంధీతో కలిసి నడిచిన రఘురామ్ రాజన్
రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 14 : దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో 10వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. బుధవారం ఉదయం సవాయి మాధోపూర్‌లో బమాన్‌వాస్ విధాన సభ నియోజక వర్గంలోని భడోతి గ్రామం నుంచి ప్రారంభమయి మొత్తంగా దాదాపు 25 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఉదయం సెషన్ అనంతరం యాత్ర దౌసా జిల్లాలోకి ప్రవేశించి బగ్డి గ్రామం వద్ద రాత్రికి విశ్రమించింది. కాగా యాత్ర సందర్భంగా నరేంద్ర మోదీ• ప్రభుత్వ ఆర్థిక మరియు సాంఘిక విధానాలను తరచుగా వ్యతిరేకించే ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్ గాంధీతో పాటు కొద్ది సేపు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇరువురూ ముచ్చటించుకుంటూ ముందుకు సాగడం పలువురి దృష్టిని ఆకర్షించింది. నోట్ల రద్దుతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పిసిసి చీఫ్ గోవింద్ దోటస్ర, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్, వందలాదిగా పార్టీ కార్యక్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాయంత్రం బగ్డి గ్రామం వద్ద రాహుల్ గాంధీ ఎప్పటి మాదిరిగానే కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రేపు శుక్రవారానికి భారత్ జోడో యాత్ర 100 రోజులు పుర్తి చేసుకోనున్న సందర్భంగా ఆ రోజు జైపూర్‌లో సార్టీ గాయకుడు సునిధి చౌహాన్‌తో ఒక కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు ఎఐసిసి జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ మంగళవారం వెల్లడించారు. కాన్సర్ట్‌లో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దౌసాలో రాహుల్ విలేఖరుల సమావేశంలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.



