భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచానికి స్ఫూర్తిదాయకం

కేంద్ర పర్యాటక, సంస్కృతి,అభివృద్ధి శాఖ మంత్రి, బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్‌ రెడ్డి
ఈనెల 14 నుంచి 17 వరకు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం
కన్హా శాంతి వనంలో ‘గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌-2024’
హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌

 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 09: సంస్కృతి, ఆధ్యాత్మికత  అనేవి భారతదేశ సాఫ్ట్‌ పవర్స్‌ అని, మన కల్చరల్‌, స్పిరిచువల్‌ గైడెన్స్‌ ద్వారా యావత్‌  ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.  ఓ సానుకూల మార్గం వైపు  ప్రపంచాన్ని తీసుకెళ్తున్నామని, అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది  మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నామని తెలిపారు.. అందుకే  యావత్‌ ప్రపంచం నేడు  భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోందన్నారు. హైదరాబాద్‌,  తాజ్‌ కృష్ణలో శనివారం ‘గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ్‌’ లో కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతూ..  ఈనెల 14 నుంచి 17  వరకు ‘గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ్‌’  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొరోనానంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగిందన్నారు. భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లని, మనదేశంలో పుట్టిన అనేక మతాలు ప్రపంచమంతా విస్తరించి. శాంతిని బోధిస్తున్నాయని తెలిపారు. ఆయా మతాల ఆచార వ్యవహారాలు, ఫిలాసఫీల కారణంగా.. ‘భారతదేశం ఆధ్యాత్మిక భిన్నత్వం’ మరింత ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.
 మన భారతదేశ శారీరక, మానసిక ఆరోగ్య విధానమైన ‘యోగా’ను యావత్‌ ప్రపంచం  ఉత్సాహంగా స్వీకరించిందని తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్‌ (ధ్యానం)ను దైనందిన జీవితంలో భాగం చేసుకుందన్నారు. మన పురాణ, ఇతిహాసాలను, గీతాసారాన్ని, వేదాలు, ఉపనిషత్తుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు ప్రయత్నిస్తున్నారని ఇటీవలి కాలంలో భారతదేశంలో ‘స్పిరిచువల్‌ టూరిజం’ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని కిషన్‌ రెడ్డి అన్నారు.  మన ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనం కోసం విదేశాల నుంచి ఇక్కడకు వొచ్చి ఆశ్రమాల్లో ఉంటూ  భారతీయ ఆధ్యాత్మిక  గొప్పదనానికి ఆకర్శితులవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పిరిచువల్‌ గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి.. ‘మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు’ బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధానమంత్రి మోదీ  ఆలోచన అని వివరించారు. దీనికి అనుగుణంగానే ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒకచోట చేర్చి విశ్వశాంతి కోసం భారతదేశంలో ఒక మహత్తర కార్యక్రమం నిర్వహించాలని మోదీ  సూచించారని తెలిపారు.  వొచ్చే 25 ఏళ్లలో (అమృత్‌ కాల్‌) ప్రేమ, శాంతి, ఐకమత్యం భావనలను విశ్వవ్యాప్తం చేయాలనేదే మోదీ  ఆలోచన అని తెలిపారు. దీనికి అనుగుణంగా.. వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో దిల్లీ లో  పలుమార్లు సమావేశమయ్యామని చెప్పారు.మార్చి14 నుంచి 17  వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, ‘వరల్డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఆఫ్‌ హార్ట్‌ఫుల్‌ నెస్‌’ సంయుక్త ఆధ్వర్యంలో షాద్‌నగర్‌  సమీపంలోని కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ్‌’ నిర్వహించబోతున్నామని తెలిపారు.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు   దాజీ  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వొచ్చారని తెలిపారు.  ఈ మహత్కార్యంలో దాదాపు 300కు పైగా స్పిరిచువల్‌ లీడర్స్‌ తోపాటు.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. గతేడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన  జీ20 సమావేశాల కోసం మనం ఎంచుకున్న థీమ్‌ ‘వసుధైవ కుటుంబం’ – వన్‌ వరల్డ్‌, వన్‌ ఫ్యామిలీ.ఇది జీ20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించిందన్నారు.ఈ గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ్‌ లక్ష్యం కూడా ఇదేనని, ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావనను ప్రోత్సహించడం, ఇందుకోసం ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ.. ‘వసుధైవ కుటుంబంకం’ ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలనేది ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.  ఈ లక్ష్యంతోనే మన దేశంలో తొలిసారి ఇంత ఉత్సాహంగా ప్రపంచ నలుమూలల నుంచి వొస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారని వివరించారు. వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి.. విశ్వశాంతికోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని చెప్పారు.  దీంతోపాటు  రేపటి తరాలకోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్‌ లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయని తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 15వ తేదీన ఈ ‘గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ’ను ప్రారంభిస్తారని, మార్చి 16వ తేదీన  ఉపరాష్ట్రపతి  జగదీప్‌ ధన్‌కర్‌  ముగింపు సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
14 సాయంత్రం ప్రముఖ గాయకుడు  శంకర్‌ మహదేవన్‌  మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఉంటుందని, 17 న కూడా.. స్పిరిచువల్‌ గురువులతో కొన్ని సెషన్స్‌ ఉంటాయని ఇటీవలే ప్రధాని  నరేంద్రమోదీ  కాన్హా శాంతి  వనాన్ని  సందర్శించారని తెలిపారు.  ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని, యోగా, ధ్యానం, సంగీతం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు విశ్వశాంతికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌ అయిన.. కాన్హా శాంతి  వనంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమం..  లక్ష్యాలను చేరుకుంటుందనే విశ్వాసం తనకుందని చెప్పారు.  ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.  సమాజ శ్రేయస్సు, మన విశ్వశాంతి కోసం.. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.  ఇందులో భాగంగానే.. ఈ ‘గ్లోబల్‌ స్పిరిచువల్‌ మహోత్సవ్‌’కు బాటలు పడ్డాయన్నారు.  ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న ‘గ్లోబల్‌ గైడ్‌ ఆఫ్‌ హార్ట్‌-ఫుల్‌-నెస్‌’  దాజీకి  ధన్యవాదాలు  తెలిపారు.  ఈ కార్యక్రమ విజయవంతానికి  మీడియా కూడా తమవంతు సహకారాన్ని అందించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు.   ఈ ఆధ్యాత్మిక సదస్సులో రామకృష్ణ మిషన్‌, పరమార్థ నికేతన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌, మాతా అమృతానందమయి మఠం, హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌, రెవ్‌ కార్డినల్‌ ఆంథోనీ పూలా, చిన జీయర్‌ స్వామి, బ్రహ్మ కుమారీలు, పతంజలి యోగపీఠం వంటి కొన్ని సంస్థలు గ్లోబల్‌ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌కు కలిసి వొస్తున్నాయని తెలిపారు. మహర్షి ఫౌండేషన్‌(అతీంద్రియ ధ్యానం), ఈషా ఫౌండేషన్‌, ఇంటర్నేషనల్‌ బౌద్ధ సమాఖ్య(ఐబీసీ), శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ, హైదరాబాద్‌ ఆర్చ్‌ డియోసెస్‌, రాష్ట్ర సంత్‌ తుక్డోజీ మహారాజ్‌ అఖిల భారతీయ శ్రీ గురుదేయో సేవా మండల్‌, సంత్‌ జ్ఞానేశ్వర్‌ దేవస్థాన్‌, అలండి, ఆల్‌ ఇండియా ఇమామద్‌ ఆర్గనైజేషన్‌ మిషన్‌ ధరంపూర్‌, శ్రీ రామ్‌ చంద్ర మిషన్‌/హార్ట్‌ఫుల్‌నెస్‌ పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *