- రామాలయం రోడ్లన్నీ జలమయం
- 43 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు
- 44 అడుగులు దాటిన నీటిమట్టం….లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునక
భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20 : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 36 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 44 అడుగులకు చేరుకుంది.ఇది అర్ధరాత్రి మరింత పెరిగి శుక్రవారం ఉదయానికి 46 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. దీనితో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. ఈ వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కులనీటిని దిగువ భాగానికి విడుదల చేసారు. అలాగే తాలిపేరు ప్రాజెక్టు నుండి 24 గేట్లు ఎత్తివేసి 10,20,099 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.
దీనితో గోదావరి ప్రభావం మరింత పెరుగుతుంది. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, ఇంద్రావతి ప్రాజెక్టు నుండి భారీగా వరదనీరు చేరుకుంటుంది. దీని ప్రభావం వలన గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడే పర్యవేక్షించి ముంపుకు గురయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇప్పటికే గోదావరి 44 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ముందస్తు చర్యలకు సిద్దమయ్యారు. భద్రాచలం ఆర్‌డిఓ కార్యాలయం చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు,బూర్గంపాడు మండలాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసారు. ప్రజలు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కోరారు.
వర్షపునీటితో రామాలయం ప్రాంతం , పలు కాలనీలు మునక
భారీ వర్షాల కారణంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. అక్కడే నిత్యాన్నదాన సత్రం వద్ద కూడ వర్షపు నీరు చేరింది. ఈ వర్షపు నీటిని గోదావరి లోకి పంపించేందుకు అధికారులు కృషి చేసారు. మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం వలన కొద్దిసేపు భక్తులు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత మోటార్ల ద్వారా నీటిని గోదావరి లోకి పంపించారు. భద్రాచలం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన లోతట్టు ప్రాంతాలైన ఏఎంఈ కాలనీ , కొత్తకాలనీ ఇండ్లలోకి నీరు చేరుకుంది. ఆ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజుపేట వద్ద వర్షపునీరు నిలిచిపోవడంతో గ్రామపంచాయితీకారులు ట్రొక్లెయిన్ ద్వారా కాలువలు తీసి నీటిని బయటకు పంపించారు.
నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు
భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాల్లి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ ఉంచి ప్రాజెక్టు 25 గేట్లు ఉండగా 24 గేట్లు పూర్తిస్థాయిలో పైకి ఎత్తి 1, 02,399 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ వరద ఉదృతి దిగువన ఉన్న గోదావరి నదిలో చేరడంతో గోదావరి నీటిమట్టం పెరగడం జరుగుతుంది.
వర్షాలు కురిసిన మొదటి లోనే ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు క్రింద ఉన్న రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రైతులు వరి నారులు పోయడంతో అవి నాటు వేటకు సిద్ధంగా ఉన్నాయి ప్రాజెక్టు నిండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.గురువారం సాయ్ర 87,933 క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి విడుదల చేసారు. మరోవైపు నిండుకుండలా తలపిస్తున్న ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు ప్రాంతం జన సందడితో నిండి, ప్రాజెక్టు అందాలను తిలకించటానికి వస్తున్న పర్యాటకులతో సందడిగా ఉన్నది.




