అది వెలిగిపోతున్న
పసిపాప నవ్వులా
ఆహ్లాద కిరణాలతో
అలరిస్తుంటుంది…
అది మల్లెపువ్వులా
అనుభూతుల పరిమళాలతో
ముంచెత్తుతుంటుంది…
అది ఆశల కట్టడాల్ని
అతలాకుతలం చేసే
భూకంపంలా
ఉద్వేగ ప్రకంపనలతో
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది…
అది ఉవ్వెత్తుకెగసే కడలిలా
బాధల అలలతో
బహుముఖంగా
భయపెడుతుంటుంది…
అది భిన్న పార్శ్వాల
ప్రవాహమై
పయనించే బ్రతుకు నది…
దాని కారుణ్యం
బహుదూరపు చెట్లను సైతం
బుజ్జగిస్తుంటుంది…
దాని కాఠిన్యం
ఆశ్రయించిన గట్లనే
కూలదోస్తుంటుంది…
రేపటి లక్ష్యాల తీరాన్ని
చేరుకోవడానికి
అందులోనే
ఆత్మవిశ్వాసపు తెడ్డుతో
ఆశయాల నావ
ముందుకు సాగిపోతుంటుంది…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
9177732414)




