ఏమిటీ?
నీవో గాయపడ్డ మనిషివా?
ఆశల రెక్కలు తెగి వేదనాశ్రువులు
నీ కలల కళ్ళను ముంచేస్తున్నాయా?
కోరికల కుత్తుకల్ని కత్తిరిస్తూ,
నీ గెలుపుగమ్యాలను
వెతల శూలాలు
తూట్లు పొడుస్తున్నాయా?
అవకాశలు ఎండమావులై
ఆశలను రేకెత్తిస్తున్నాయా?
నిరాశానిస్పృహల వ్యాఘ్రం
నీ ఆశయ దేహాన్ని కబళిస్తోందా?
నవ్వుతోంది నీ అంతరాత్మ నిన్ను చూసి.
కష్టాల కడలిలో, శిథిలమైన నావలో
ఎలా పయనిస్తావని?
వ్యధల కంటకాల ఒడిలో,
మాయని గాయాల ఊబిలో ఉన్న నీవు
కుత్సితాల బురదలోంచి పుట్టి
అనుబంధాలు,ఆప్యాయతలను వెలేసి
ఏ ఎండకాగొడుగు పడుతూ
జంబుకాలై పబ్బం గడుపుకుంటూ
మనసులు కరడుగట్టి,
ఆర్ద్రతలేని పాషాణాలౌతోన్న
మనుషులున్న ఈ సమాజంలో
బతకాలంటే,
నీ వ్యాధి నయం కావాలంటే
నీతీ, నిజాయితీలకు తిలోదకాలొదిలి,
ఆత్మాభిమానం తాకట్టు పెట్టి,
నువ్వు ఊసరవెల్లిగా మారాలి.
మోసం చేయాలి.
మనసులోనుంచి మంచితనం తుంచేయాలి.
మంచిగా నటిస్తూనే వంచన చేయాలి,
వంచనే నీ కంచెకవచం కావాలి.
అప్పుడే నీకు సాంత్వన.
మరేం చేస్తావ్?
ఇప్పటి దాకా బొమ్మనే చూసావు,
మరో కోణమూ చూడు.
ఓయ్ నిన్నే?
చెప్పింది అర్ధమయ్యిందిగా
త్వరగా మారతావుగా!
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




