– భూగర్భ విద్యుత్ సరఫరా పై అధ్యయనం
-ఫ్యూచర్ సిటీకి ఇది ఉపయోగకరమన్న మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో విద్యుత్ శాఖ అధికారులతో బిజీగా గడిపారు. బెంగళూరు నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థ పై అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(కేపీటీసీఎల్), బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్ ఓఎం) అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టు పై చర్చించారు.
ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టు పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లనుంచి భట్టి విక్రమార్క వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాదులో కొత్తగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కరెంటు వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థల పట్ల నమ్మకం, భద్రత, ఆకర్షణీయత మెరుగుపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది ఒక భాగం.
మొదట బీఈఎస్సీఓఎం ( బెంగళూరు ఎలక్ట్రికల్ సప్లయి కంపెనీ లిమిటెడ్) అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పంకజ్ పాండే, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితర అధికారులు పలు అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కృష్ణ భాస్కర్ (సీఎండీ, ట్రాన్స్ కో), ముషర్రఫ్ ఫారూఖీ (సీఎండీ ఎస్ పీడీసీఎల్) లు ఈ చర్చలలో పాల్గొన్నారు. 2018–19లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 7,400 కిలోమీటర్ల 11కె.వి. ఓవర్‌హెడ్ (ఓహెచ్) లైన్లను, వేలాది కిలోమీటర్ల లో టెన్షన్ (ఎల్టీ) లైన్లను భూగర్భ (యూజీ) లేదా ఏరియల్ బంచ్డ్ (ఏబీ) కేబుల్స్గా మారుస్తున్నారు.
ఒక ముఖ్యమైన కొత్త ఇన్నోవేషన్‌గా గా యూజీ మార్గాల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఏఎఫ్సీ) డక్టులను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో టెలికాం సంస్థలతో లీజ్ ద్వారా ఆదాయ మార్గాలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక నిర్మాణం, సాంకేతిక నష్టాలు మరియు విద్యుత్ ప్రమాదాల్లో తగ్గుదల, ఓఎఫ్సీ మౌలిక వసతుల వాణిజ్య ఉపయోగానికి సిద్ధత, రింగ్ మైన్ యూనిట్లు (ఆర్ ఎంయూలు) వంటి అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రాజెక్ట్ స్థాయి మరియు అమలులోని క్రమశిక్షణను ప్రశంసించారు. ఫ్యూచర్ సిటీ గ్రీడ్ ఆధునీకరణ కార్యక్రమాల్లో ఈ అనుభవాలను ఎలా అన్వయించాలో కూడా ఆయన వివరించారు.
ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లేశ్వరంలో (15వ క్రాస్) ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడ అండర్‌గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తోపాటు అండర్‌గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) వ్యవస్థను అమలు చేశారు. ఈ ప్రాంగణంలో ట్రాన్స్ఫార్మర్లను పూర్తిగా భూమిలో పాతిన ఛాంబర్లలో ఉంచి, వీటికి వీధి స్థాయిలో సులభంగా నిర్వహణకు వీలైన ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఇది పట్టణ ప్రాంతాల్లో స్థల వినియోగాన్ని మెరుగుపరచడంలో మరియు భద్రతను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఫీల్డ్ విజిట్ సమయంలో ఉప ముఖ్యమంత్రి ఇంజినీర్లు మరియు కాంట్రాక్టర్లతో నేరుగా మాట్లాడారు. భద్రతా నిబంధనలు, లోడ్ బ్యాలెన్సింగ్ సాంకేతికతలు మరియు అత్యవసర మరమ్మతుల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.




