ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు మాత్రమే కేటాయించి సిఎం కెసిఆర్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన నిర్ణయం మార్చుకొని బిసిలకు కనీసం 50 టికెట్లు కేటాయించాలన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుందారం గణేష్ చారి మాట్లాడుతూ 5 శాతం ఉన్న రెడ్డిలకు 40 సీట్లు, 6 శాతం ఉన్న వెళ్ళమకు 11 టికెట్లు కేటాయించడం పట్ల సీఎం పునరాలోచించుకోవాలన్నారు. బీసీలకు సరైన న్యాయం చేయాలని తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారి తల్లికి హుజూర్నగర్ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. ప్రతి కులానికి ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి అన్ని పార్టీ నాయకులు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షులు శ్యాం కురుమ, మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు సిద్ధాంతం శ్యామల, బీసీ కుల సంఘాల రాష్ట్ర నాయకులు చర్లపల్లి మనోజ్ కుమార్, ఈడిగ శ్రీనివాస్, గూడూరు భాస్కర్, మాదేశి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



