- ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలి
- పార్టీ శ్రేణులకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు
- మాది పేద పార్టీ…ప్రజాబలంతోనే ఆ రెండు ధనిక పార్టీలను ఎదుర్కుంటామన్న రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : బీజేపీని, బీఆర్ఎస్ను వేరుగా చూడొద్దని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు పార్టీలూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. దీనిని ఎదుర్కునేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కునేందుకు మనం సంసిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఇందిరా భవన్లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఎల్డిఎమ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ…గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ, బీఆరెస్ను ఎదుర్కునేందుకు శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలన్నారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందన్నారు.
ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్లు ఉన్నాయని, వోటరు జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల వోట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. బూత్లు మార్చి వోటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కునడంలో బూత్ లెవెల్ ఎజెంటే కీలకమన్నారు. వోటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లే అన్నారు. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని, 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మాది పేద పార్టీ…ప్రజాబలంతోనే ఆ రెండు ధనిక పార్టీలను ఎదుర్కుంటాం
మాది అత్యంత పేద పార్టీ…బిజెపి, బిఆర్ఎస్లలాగా ధనం ఖర్చు చేయలేం..జనబలంతోనే ఈ రెండు పార్టీలను ఢీకొంటామని రేవంత్ రెడ్డి అన్నారు. తమది ప్రజల్లో బలమున్న పార్టీ అన్నారు. పేదల పక్షాన పోరాడిన చరిత్రుంది కనుక ప్రజలకు తమకు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఎన్నికల్లో వొచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. దీన్ని కాంగ్రెస్ అధిగమించాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో వి•డియాతో మాట్లాడుతూ… గతంలో గ్రామపెద్ద ఏ గుర్తు చెబితే ఆ గుర్తుకు గ్రామ ప్రజలు వోటు వేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
ఇప్పుడు రాజకీయ పార్టీలను దాటి.. ఏజెన్సీలు వొచ్చాయని, ఏజెన్సీలను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. ఈ దేశంలో అత్యంత పేద పార్టీ కాంగ్రెస్ అని.. పార్టీ ఏ రకమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటుందో అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యాయని, బీజేపీ, బీఆర్ఎస్లను జన బలంతో కొట్టాలని రేవంత్ అన్నారు. పెండింగ్లో ఉన్న మూడు జిల్లా కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. జులై 25లోగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ తమ పార్టీకి అనుకూలంగా పనిచేయించుకుంటుందని, ఇది ఓ రకంగా అధికార దుర్వినియోగమని అన్నారు. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక వోట్లను గుర్తించాలన్నారు.




