బీజేపీది బ్రిటిష్‌ ఎజెండా

  • 400 సీట్లు..రిజర్వేషన్ల రద్దు కోసమే ˜ రాజ్యాంగాన్ని కాపాడడమే కాంగ్రెస్‌ ఎజెండా
  • కారు ఇక తూకానికే…పనైపోయిందనే కేసీఆర్‌ బస్సు యాత్ర
  • రాజేంద్రనగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి : చేవేళ్లలో రంజిత్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : బీజేపీ ఆరెస్సెస్‌ విధానాలను అమలు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. వ్యాపారం ముసుగులో బ్రిటీషర్లు ఇండియాను ఆక్రమించుకున్నారని, సూరత్‌ నుంచే బ్రిటిష్‌ ఆక్రమణ మొదలైందన్నారు. బీజేపీ కూడా ఈస్టిండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుందని ఆరోపించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బ్రిటిష్‌ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ బ్రిటిష్‌ ఎజెండాను అమలు చేయాలనుకుంటున్నదని, వారి ఎజెండా రిజర్వేషన్లు రద్దు చేయడమేనని విమర్శించారు. గురువారం  రాజేంద్రనగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా కాంగ్రెస్‌ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం..రిజర్వేషన్లు అమలు చేయడమని స్పష్టం చేశారు. సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రజలను చూస్తుంటే కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. పదేళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్‌ కారును ప్రజలు కారా?నాకు పంపారని, కారా?నాకు వెళ్లిన కారు ఇక సరాసరి తూకానికేనని విమర్శించారు. కారు పనైపోయింది గనుకనే నేడు కేసీఆర్‌ బస్సు వేసుకుని బయలుదేరారని, కేసీఆర్‌ బస్సు యాత్ర వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లుందని ఎద్దేవా చేశారు. నాలుగు గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్‌ అసెంబ్లీకి మాత్రం రాలేదని, కాంగ్రెస్‌ కడిగేస్తుందనే భయం కేసీఆర్‌లో ఉందన్నారు.

కేసీఆర్‌ ఊరూరు తిరిగినా.. ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కున్నా..తెలంగాణ సమాజం ఆయన్ను నమ్మదని అన్నారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ.. ఇచ్చింది కేవలం 7 లక్షలు మాత్రమేనని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతులను మోసం చేశారని, జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని పదేళ్లయినా 15 పైసలు కూడా వేయలేదని ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, బీసీ జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారని, దీనికి బీజేపీ భయపడి కాంగ్రెస్‌పై కుట్రలు పన్నుతుందన్నారు.

అందరి అభిప్రాయాలతోనే చేవెళ్లలో రంజిత్‌ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలని, పార్లమెంట్‌లో మాట్లాడాలని, చేవెళ్ల అభివృద్ధి జరగాలంటే రంజిత్‌ రెడ్డిని పార్లమెంట్‌కు పంపించాలని చెప్పారు. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని, బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని వోట్లు దండుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్‌ షా చెబుతున్నారని, దీనిపై వారి  విధానమేంటో విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పాలన్నారు. వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు కట్టబెట్టాలని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *