తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో నిర్వహించబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కొత్తవారిని అదేస్థాయిలో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యవహారాల పట్ల విసుగుచెందిన పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా లాంటి ప్రముఖులెందరో విచ్చేస్తుండడంతో వారి సమక్షంలో పలువురు నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్నది మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు. ఇప్పటికే రెండు పార్టీలు మారిన విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో పార్టీలో చేరుతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొండా వెంకట్‌రంగారెడ్డి మనుమడిగానే కాకుండా, పెద్ద పారిశ్రామిక వేత్తగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజామ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఘన చరిత్ర ఉన్న కుటుంబానికి చెందినవాడని తెరాస అధినేత కెసిఆర్ ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించి 2014 లోకసభ ఎన్నికల్లో చేవెళ్ళ నియోజకవర్గంనుంచి గెలిపించుకున్నారు. అయితే టిఆర్ఎస్తో ఆయన ఎందుకనో విబేధించి నాలుగేళ్ళకే ఆ పార్టీని వీడి, 2019లో మరోసారి అదే చేవెళ్ళనుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు.
కాని, అక్కడ కూడా ఇమడలేకపోయారు. 2021 మేలో ఆ పార్టీకి రాజీనామా చేసినప్పటినుండి తన వ్యాపార పనులకే పరిమితమైనారు. అయితే ఆయన బిజెపిలో చేరుతారంటూ గతంలో అనేకసార్లు వార్తలు వొచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించనూలేదు. సమర్థించనూ లేదు. కాని, వొచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించగలిగే పార్టీ బిజెపి అన్న విషయాన్ని ఘంటాపథంగా చెబుతూ వొచ్చారు. తాను స్వయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైనట్లుగా అనేక సందర్భాల్లో చెబుతూ వొచ్చారు. అయితే ఒక్క టిఆర్ఎస్ మీదనే కాకుండా కాంగ్రెస్ విషయంలోనూ ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆపార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్నప్పటికీ ప్రజల్లో విశ్వాసాన్ని పోందతేకపోతున్నదంటూ చెప్పుకురావడం వెనుక ఆయన బిజెపి వైపే మొగ్గుతున్నారన్నది స్పష్టమయింది. అయితే ఈ సందర్భంలోనే బిజెపిలో చేరడానికి దాదాపు ఇరవై అయిదు నుండి ముప్పై మంది తెలంగాణకు చెందిన కీలకనేతలు సిద్దంగా ఉన్నారని గతంలో వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆయన తనతో పాటు మరికొందరిని బిజెపిలో చేర్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.
అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అలకబూనిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఆ పార్టీలకు రాజీనామాచేసి కాషాయ కండువాలు కప్పుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధానంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ను తాము కలుసుకోలేక పోతున్నామని, ఏ విషయాన్ని ముఖాముఖిగా ఆయనతో మాట్లాడి పరిష్కరించుకోలేక పోతున్నామంటూ కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వాపోతున్నారు. చెన్నూరు మాజీ ఎంఎల్ఏ నల్లాల ఓదేలు, ఖైరతాబాద్ టిఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డిలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా, ఆలేరు శాసనసభకు పోటీచేసి ఓటమి పాలైన భిక్షమయ్యగౌడ్, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా ఉన్న సామ వెంకట్‌రెడ్డి తాజాగా బిజెపి తీర్థం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే పార్టీలో ఖమ్మం, నల్లగొండ తదితర ప్రాంతాల్లోని సీనియర్ నేతలు చాలా మంది ఇంకా అసంతృప్తితోనే కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పార్టీలో అంతర్ఘత కలహాలు ఎక్కువైనాయి. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ కలిగించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానించే పక్రియలో బిజెపి ఉంది.
రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి దూకుడుగా ముందుకు పోతుండడం, జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలోనే స్థానిక నాయకులు బిజెపివైపు మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విశ్వేశ్వర్‌రెడ్డి విషయాని కొస్తే గెలిచి ఓడిన చేవెళ్ళ పార్లమెంటు స్థానంనుండే మరోసారి పోటీ చేసేవిధంగా బిజెపితో అంతర్ఘతంగా ఒప్పందం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రల సందర్భంలోనే వీరిద్దరి భేటీ• జరిగింది. తాజాగా బుధవారం బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌తో ఆయన దాదాపు ముప్పావు గంటసేపు సమావేశమవడంతో ఇక ఆయన బిజెపిలో చేరిక ఖాయమని తెలుస్తున్నది. అయితే ఆయన ఒక్కరే కాకుండా తనతో పాటు పలువురికి కాషాయ కండువా కప్పించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తున్నది.



