- స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
- కాంగ్రెస్‌లో జోష్ నింపిన ఖమ్మం తెలంగాణ జనగర్జన సభ
ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీ పట్ల తమ వైఖరిని కుండబద్ధలు కొట్టింది. అంతేగాకుండా బిజెపి, బిఆర్‌ఎస్ వేరు కాదని, బిఆర్‌ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ సమితి అని భాష్యం చెప్పడం, బిఆర్‌ఎస్ బిజెపికి బి టీమ్ అంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించడమే కాకుండా ఒత్తి పలుకడం ద్వారా తమకు ఆ రెండు పార్టీలు వేరువేరు కాదని, రెండు పార్టీలను రాజకీయంగా తమకు ప్రత్యర్థి పార్టీలుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఒక వేళ బిఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తే ఆ సమావేశానికి తాము హాజరు కాబోమని నిర్వాహకులకు స్పష్టం చేసినట్లు రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రకటించడం ద్వారా తాము బిఆర్‌ఎస్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నామో తెలియజేశారు. అంటే ఇక జాతీయ స్థాయిలోనూ బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని పార్టీ క్యాడర్ మొత్తానికి తమ వైఖరిని స్పష్టం చేశారు.
ఈ స్పష్టత రావలసిన అవసరం పార్టీపరంగా ఎందుకు వొచ్చిందంటే ఒకానొక సందర్భంలో శాసన సభా ముఖంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానిగా మోదీ పాలన కన్నా గత కాంగ్రెస్ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ పాలన బాగుందని ప్రశంసించడం, రాహుల్ పార్లమెంట్ సభ్యాత్వాన్ని రద్దు చేసిన సందర్భంలో సిఎం కెసిఆర్ దాన్ని ఖండించడం, దిల్లీలో ఆ సందర్భంగా కాంగ్రెస్ చేసిన నిరసన కార్యక్రమాల్లో బిఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొనడం వంటి వాటితో ప్రజల్లో బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా అన్న కొంత అనుమానం కలిగిన మాట వాస్తవం. దానికి తోడు ఈ సందర్భాలను బిజెపి పదేపదే ప్రస్తావించడం వల్ల ఇప్పటి వరకు కొందరు పార్టీ నాయకులకు, ప్రజలకు కొద్దో గొప్పో ఉన్న అనుమానాలను రాహుల్ తన ప్రకటన ద్వారా నివృత్తి చేసినట్లయింది.
ఇక ఆదివారం తెలంగాణ జన గర్జన పేర కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ ఆ పార్టీకి సంబంధించి విజయవంతమైనదిగానే పరిగణించాలి. ఏ ప్రయోజనాలను ఆశించి నిర్వహించారో అవి నెరవేరినట్టే అనుకోవాలి. సభకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడం నిస్సందేహంగా ఆ పార్టీ శ్రేణుల్లో మంచి జోష్‌ను నింపింది. అధికార పార్టీ తమ సభ విజయవంతం కాకుండా అడుగడుగునా అడ్డంకులు కల్పించిందని, అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వొచ్చారని ఆ పార్టీ ఆరోపించడం అటుంచితే ఎట్లయితేనేమి సభకు మంచి స్పందనే కనిపించింది. ఇన్ని రోజులు ఎవరితోవ వారిదే అన్నట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న, భిన్నాభిప్రాయాలు కలిగిన పార్టీ నాయకులందరూ ఒక్క వేదికపైకి చేరడం ఆ పార్టీ క్యాడర్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి. దానికి తోడు ఒకవైపు స్థానిక మాజీ ఎంపి పొంగులేటి తన అనుచరులతో కలిసి లాంఛనంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, మరో వైపు మూడు నెలలకు పైగా పీపుల్స్ మార్చ్ పేర రాష్ట్ర వ్యాప్తంగా సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపుకు ఈ సభ వేదిక కావడం ఆ ప్టాకి అదనపు ఉత్సాహాన్నిచ్చింది.
ఇక ఈ సభ ద్వారా రాబోయే డిసెంబర్‌లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ గాంధీ శంఖం పూరించారు. ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలికి చేరుకునే దారిలో ప్రజలు ఒక్కసారిగా రాహుల్ వాహనానికి దగ్గరగా దూసుకు వొచ్చినా వారిని అడ్డగించిన సెక్యూరిటీని వారించడం, కుటుంబపరంగా గతంలో జరిగిన దుర్ఘటనలను కూడా లెక్క చేయకుండా, ఏ మాత్రం జంకు లేకుండా వాహనం పైభాగం నుంచి ప్రజలను ఆత్మీయంగా చేతూలూపుతూ పలుకరించడం పలువురిని ఆకర్శించింది. సభా వేదిక పైనా భట్టీ, సీతక్క లాంటి నాయకులను, సభకు హాజరయిన గద్దర్‌ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ రాహుల్ ఉత్సాహంగా కనిపించారు. ఆయన ప్రసంగం అసాంతం కూడా ఉత్సాహంగా కొనసాగింది. ఏ మాత్రం గందరగోళం లేకుండా తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు. కర్ణాటక మాదిరి తెలంగాణలో కూడా అధికారంలోకి వొస్తామని ధీమా వ్యక్తం చేయడం ద్వారా పార్టీ నాయకులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పకనే చెప్పారు. స్థానిక ఎన్నికలలో ఆయా రాష్ట్రాలలో పోటీపడినా జాతీయ స్థాయిలో ఆప్, టిఎంసి, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కొనసాగడానికి అభ్యంతరం లేదు కానీ బిఆర్‌ఎస్‌తో కలిసేది లేదనే స్పష్టతనిచ్చారు.
బిజెపి బిఆర్‌ఎస్‌ల మధ్య అవగాహన ఉందనడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ధరణీ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లలో కుంభకోణం వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యం కాదని రాహుల్ చెప్పడం ప్రజల్లోకి పోవడానికి పార్టీ క్యాడర్‌లో మరి కొంత ఉత్సాహాన్ని నింపింది. ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే వయోవృద్ధులకు, వితంతువులకు రూ. 4,000 ఆసరా పెన్షన్ అందజేస్తామని ప్రకటించడం పార్టీకి కొంత ఊపునిచ్చింది. ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులలో, క్యాడర్‌లో ఈ బహిరంగ సభ కొంత ఆత్మ విశ్వాసాన్ని నింపండంతో పాటు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాడానికి కావలసిన ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.




