సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తప్పు చేసిన బిఆర్ఎస్ నాయకులను వదిలేసి బిజెపి నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు పురుమాండ్ల నరసింహారెడ్డి విమర్శించారు.గురువారం సిద్దిపేటలోని జిల్లా పార్టీ
కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసుల చర్యను తప్పు పట్టారు.సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం రోజు మంత్రి హరీష్ రావు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఉన్న ఎల్ఈడి స్కిన్ ను తన్నుతూ అక్కడున్న బిఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టి ఇప్పుడు బిజెపి నాయకుల పైన ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేపించడం ఎంతవరకు సమంజసం అనిప్రశ్నించారు. ఆరోజు సంఘటనను పోలీసు అధికారులు స్వయంగా చూసినా బిజెపి నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసు అధికారులు బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగానే బీజేపీ నాయకుల పై కేసులు నమోదు చేయడం తగదన్నారు.స్వయంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సిపి కార్యాలయంలో మంత్రి హరీష్ రావుపై ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు తిరిగి ఎమ్మెల్యే తో పాటు జిల్లా అధ్యక్షుడు పై కేసు నమోదు చేయడం పట్ల పోలీసు వ్యవస్థ ఎవరి కనుసన్నల్లో నడుస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు సిద్దిపేటలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా ప్రత్యేక రూల్స్ పెట్టడం సరికాదని అన్నారు.ఇకనైనా బిజెపిని నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు గుండ్ల జనార్ధన్,అనిల్ గౌడ్,సలేంద్రి రాజు,పులి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





