అందుకే మోదీ సభకు డుమ్మా
విజయశాంతితో మాట్లాడే ప్రయత్నం చేసిన సోనియా?
వివేక్, విజయశాంతితో బిఆర్‌ఎస్ నేతల సంప్రదిపులు?
ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: బిజెపి ఫైర్‌బ్రాండ్, జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ నాయకత్వం నాయకత్వంపై అసంతృప్తి ఉన్న కారణంగానే శనివారం వరంగల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన విజయ సంకల్ప సభకు విజయశాంతి డుమ్మా కొట్టినట్లు అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు శనివారమిక్కడ ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి. బిజెపితో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి అద్వానీ, వాజ్‌పేయితో కలిసి పని చేశారు. ఇటు సినీమా పరంగా గ్లామర్, ఛరీష్మా ఉన్న విజయశాంతి…పార్టీలో తనకు దక్కాల్సినంతగా గౌరవం, ఇవ్వాల్సినంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా, పార్టీ నాయకత్వం తన సేవలను సరైన రీతిలో వినియోగించుకోవట్లేదని భావనతో ఆమె ఉండటంతోనే మోదీ సభలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ను కాదనుకొని వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి కమలనాథుల పాలి‘ట్రిక్స్’తో గత కొంత కాలంగా సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనకు బాధ్యతలేమీ అప్పగించలేదని అసంతృప్తితో రగిలిపోతున్న రాములమ్మ పలు సందర్భాలలో తన సేవలను ఎలా వాడుకుంటారనేది బండి సంజయ్, లక్ష్మణ్‌లకే తెలియాలనీ, తన పాత్ర ఎప్పుడూ టాప్ పాత్రేనన్న రాములమ్మ.. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడానని.. తనకు పాత్ర లేకుండా చేయాలని చూస్తే పాతరేస్తే బాగుంటుందంటూ ఎవరూ ఊహించని రీతిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూడా. గత కొన్ని నెలలుగా రాష్ట్ర పార్టీలో అంతర్గత పోరు బిజెపిని కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ… నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి ప్రమాదంగా భావించిన పార్టీ అధిష్టానం సంస్థాగతంగా కొన్ని దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వీటిలో ముఖ్యంగా… పార్టీ చీఫ్‌గా ఉన్న బండి స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నియమించడం, పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ ఛైర్మన్‌గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించడం, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడుగా నియమించింది. ఈ సంస్థాగత మార్పులతో పార్టీలో నెలకొన్న సమస్య సమసిపోతుందని బిజెపి ఢిల్లీ పెద్దలు భావించారు. కానీ, సమస్య సమసిపోకపోవడమే కాకుండా, పార్టీకి చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులైన విజయశాంతితో పాటు జి.వివేక్ వెంకటస్వామి తదితర సీనియర్ నేతలు వరంగల్‌లో జరిగిన మోదీ సభకు గైర్హాజరయ్యారు. ఇప్పుడే ఇదే కాషాయం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఎంతో సీనియర్ అయిన తనకు పార్టీలో బాధ్యతలు అప్పగించకపోవడం, పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో పాటు పార్టీ చీఫ్‌గా ఉన్న బండిని తప్పించడంపై రాములమ్మ తన అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై రాములమ్మ గుస్సా ఉన్న కారణంగానే మోదీ సభకు డుమ్మా కొట్టగా..పార్టీలో తనకంటే తర్వాత చేరిన ఈటల రాజేందర్‌కు ఎలక్షన్ మేనేజ్‌మెంటు కమిటీ ఛైర్మన్ పదవీ ఇవ్వడం పట్ల వివేక్ వెంకటస్వామి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.




