బిజెపి చలో సెక్రటేరియట్‌ ఉ‌ద్రిక్తం

ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

కోల్‌కతా, సెప్టెంబర్‌ 13 : ‌పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‌కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. దీంతో రాణిగంజ్‌ ‌రైల్వే స్టేషన్‌ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య
ఘర్షణ తలెత్తింది. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్, ‌టియర్‌ ‌గ్యాస్‌ ఉపపయోగించారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు.

పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాణిగంజ్‌ ‌రైల్వే స్టేషన్‌ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దుర్గాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో 20 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని బీజేపీ నేత అభిజిత్‌ ‌దత్తా ఆరోపించారు. బీజేపీ నేతలు పోలీసుల తీరుని తప్పుబట్టారు. శాంతియుత నిరసనకు అనుమతించి శాంతిభద్రతలు కాపాడేల్సిన పోలీసులే హింస చెలరేగేలా చేస్తున్నారన్నారు. బెంగాల్‌ ‌ప్రతిపక్ష నేత, మాజీ టీఎంసీ నాయకుడు సువేందు అధికారి కూడా మమత ప్రభుత్వంపై మండిపడ్డారు. బెంగాల్‌ ‌ను ఉత్తర కొరియాలా మార్చారని విమర్శించారు. మరోవైపు టీఎంసీ నేతలు పోలీసుల చర్యను సమర్థించారు.అసలు బీజేపీ ఎందుకు ఆందోళనలు చేస్తుందని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై నిరసన చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *