ఎంఐఎం ఎంఎల్సీ అభ్యర్థికి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మద్దతివ్వడంతో కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధంపై అపోహలు తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలనుండి ఎంఐఎంతో బిఆర్‌ఎస్ సుహృదయ భావం కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు, ప్రవేశపెడుతున్న పథకాలకు ఎంఐఎం మద్దతునిస్తూనే ఉంది. అయితే ఇటీవల తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ పార్టీనేత అక్బరుద్దీన్ ఓవైసీ తమ సంఖ్యాబలంపై ఆవేశంగా మాట్లాడినతీరు అధికార పార్టీకి ఎంఐఎం దూరమవుతున్నదా అన్న అనుమానానికి తావేర్పడింది. శాసనసభలో తాను మాట్లాడే విషయంలో ఆయా పార్టీల సభ్యుల సంఖ్యను బట్టి సమయం కేటాయించడం జరుగుతుందని స్పీకర్ చెప్పడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. అయితే తామీసారి ఎక్కువ సంఖ్యలో పోటీచేసి, ఎక్కువ మంది ఎంఎల్‌ఏలతో సభకు వస్తామంటూ ఆవేశపడ్డారు. కనీసం యాభై స్థానాల్లో ఈసారి పోటీచేస్తామని దాని కొనసాగింపుగా ఆయన అనడం అధికారపార్టీతో పోటీ పడుతుందా అన్న అనుమానాన్ని కలిగించింది.
ఎంఐఎం జాతీయ పార్టీగా విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి స్థానాలను దక్కించుకునే కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. అయినప్పటికీ హైదరాబాద్‌లో పాత బస్తీ వరకే పరిమతం అయింది.. కాని అక్బరుద్దీన్ శాసనసభలో అన్న మాటల వెనుక మర్మం ఏదో ఉందన్నది స్పష్టంగా ధ్వనించింది. ఎంతకాలం ఓల్డ్ సిటీకే పరిమితమవుతామన్న ఆలోచన ఎంఐఎంకు ఉందేమోనన్న భావన కలుగుతోంది. హైదరాబాద్ పాత నగరాన్ని మినహాయిస్తే నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మైనార్టీలు దాదాపుగా బిఆర్‌ఎస్‌కే మద్దతిస్తున్నారన్నది గత ఎన్నికల ద్వారా స్పష్టమవుతున్నది. దానికితోడు అటు రంజాన్, ఇటు క్రైస్తవుల పండుగలను పురస్కరించుకుని మహిళలకు బట్టలు పంచిపెడుతుండడం వల్ల కూడా బిఆర్‌ఎస్‌కు వారు అనుకూలమన్న భావన ఉంది. ఎట్టి పరిస్థితిలో మైనార్టీ వర్గాలను బిఆర్‌ఎస్ దూరం చేసుకోదన్నట్లుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఆ వర్గాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు.
ఈ వార్షిక బడ్జెట్‌లో 2,200 కోట్లను కేటాయించడం ద్వారా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వర్గాల మన్నలను పొందగలిగిందనే చెప్పాలె. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరుగని విధంగా గత ఎనిమిదేళ్ళలో మైనార్టీలకోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనమిదివేల అయిదు వందల కోట్లకు పైగానే ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్న అక్బరుద్దీన్ ఆగ్రహానికి కారణమేమై ఉంటుందన్నది ప్రధానాంశమైంది. సభలోకూడా ముఖ్యమంత్రినితో సహా మంత్రులు, ఎంఐఎం వాసనసభ్యులు ఒకరినొకరు అభినందించుకునే క్రమంలో అక్బరుద్దీన్ ఎందుకు అంత ఆవేశపడ్డాడన్నది ఆలోచింపజేసేదిగా ఉంది. ఈ రెండు పార్టీల స్నేహబంధంపై ఇలా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికలో మజ్లీస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు బిఆర్‌ఎస్ ప్రకటించడం ఈ రెండు పార్టీలపై కొనసాగుతున్న చర్చను మరో దిశకు తిప్పాయి. ఎప్పటిలాగానే ఈ రెండు పార్టీలు స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తాయన్న సంకేతాన్ని దీనిద్వారా ఇచ్చినట్లైంది.
ఎంఐఎం ఎంఎల్సీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్ వేశారు. డమ్మీ అభ్యర్థిగా మహ్మద్ రహీంఖాన్ కూడా దాఖలు చేసినప్పుడు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్‌లు కూడా వెంటరావడంతో ఈ రెండు పార్టీల మధ్య ఎదో ఉందన్న అనుమానాలకు తెరపడినట్లేననుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలికమా, వొచ్చే ఎన్నికల వరకు ఇలానే కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారిగా మరో తొమ్మిది, పది నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితిలో బిఆర్‌ఎస్ అధినాయకుడు కెసిఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంగా ఈ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. బిజెపికి మొదటినుండి ముస్లీం సామాజిక వర్గం దూరమే కాబట్టి కాంగ్రెస్ వీరితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయాత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వాలున్నప్పుడు మైనార్టీ వర్గాలు ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నాయి. ఇప్పుడుకూడా ఆ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఎంఐఎం మొగ్గుచూపే అవకాశాలేమైనా ఉన్నాయా అన్న కోణంలోకూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను మరొకరి చేతిలో పెడితే అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రచారంచేస్తున్న బిఆర్‌ఎస్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాల్సిందేనంటూ తమ శ్రేణులను ఉత్సాహపరిచే పనిలోఉంది. ఈ క్రమంలో గత తొమ్మి దేళ్ళుగా పాలనలో మద్దతిస్తున్న మజ్లీస్‌ను వదులుకునే పరిస్థితిలో బిఆర్‌ఎస్ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




