ఇటీవల కొంత కాలంగా…ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ అద్భుత విజయం అనంతరం తెలంగాణలో రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక లో• ఎన్నికల ఫలితాలు వొచ్చేంత వరకు తరచుగా జాతీయ నాయకుల సభలతో, రకరకాల కార్యక్రమాలతో ఊపును, ఉత్సాహాన్ని కనబరిచి తెలంగాణలో బిఆర్ఎస్, బిజెపిల మధ్యే ప్రధాన పోటీ అని ఊదరగొట్టిన బిజెపి ఆ తర్వాత ఒక్కసారిగా కొంత స్తబ్దుగా మారింది. అప్పటి వరకు బిజెపి వైపు చూసిన ముఖ్య నేతలు సైతం వెనక్కి పోవడం, చాలా మంది కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకోవడం, చివరికి తమ పార్టీలో ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తుండడం ఆ పార్టీకి మరింత నిరుత్సాహం కలిగించింది. ఇక మరోవైపు కర్ణాటక•లో తమ పార్టీ గెలుపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నిస్సందేహంగా బూస్టింగునిచ్చింది.
అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కుంటుండడం, ఇటీవల రాహుల్ కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించడం, రేవంత్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యాక పార్టీ కార్యకలాపాలను విస్తరించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కర్ణాటక లో విజయానికి ప్రధాన కారణమైన నేతలంతా తమ పంతాలను, స్వప్రయోజనాలను కనీసం ఎన్నికలయ్యేవరకైనా పక్కకు పెట్టి ఐక్యంగా పోరాడాలనే ఆలోచనకు దాదాపు ముఖ్యనాయకులందరూ రావడం ఆ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించిన బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేతలు, బిజెపిలో ఇమడలేక పోతున్న నేతలు, బిఆర్ఎస్లో టికెట్ వొచ్చే అవకాశంలేని, ఇమడలేక పోతున్న పలువురు నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడం, కొంత మంది పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం చకచకా జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో రెండు పర్యాయాల పాటు అధికారంలో కొనసాగుతున్న పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్ రాజకీయ పార్టీలుగా చేతులు ముడుచుకుని కూర్చోవు. మారిన రాజకీయాలకు అనుగుణంగా ఆ పార్టీలు తమ వ్యహాలకు పదునుపెట్టడం సహజం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బిజెపికి రాష్ట్రం కన్నా కేంద్రంలో అధికారం చేజిక్కుంచుకోవడం ప్రధాన లక్ష్యం. ఆ విధంగా బిఆర్ఎస్ కన్నా 100 సంవత్సరాల చరిత్ర, ఇప్పటికీ గ్రామ స్థాయి వరకు క్యాడర్, సంప్రదాయ వోటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించడం కాదనలేని సత్యం. కనుక కాంగ్రెస్ పార్టీని వీలైనంత వరకూ ఎక్కడికక్కడ నిలువరించడానికి అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుంది. అందుకే తెలంగాణకు సంబంధించి మూడు నెలల కిందటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న బిఆర్ఎస్, బిజెపిలు పరిస్థితులను అనుసరించి తమ విధానాలను మార్చుకున్నాయి.
2014లో బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత నోట్ల రద్దు, జిఎస్టి సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు బిఆర్ఎస్ అంటే అప్పటి టిఆర్ఎస్ సహకరించింది. కానీ ఒక సంవత్సర కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారిన అనంతరం ప్రధాని మోదీని, కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్ర స్థాయిలో అధిక్షే•పిస్తూ వొచ్చారు. అట్లాంటిది గత మూడు నెలలుగా గమనిస్తే కారణమేదైనా బిజెపిని అంతకుముందు ఎంతటి పరుషపదజాలంతో దుయ్యబట్టారో దానిలో పదోవంతు స్థాయిలో కూడా విమర్శించడం లేదు. కేంద్ర ప్రభుత్వం విధానాల్లో ఉన్నఫళంగా వొచ్చిన మార్పేమీ లేదు. అయితే దీనికి కారణమేమిటని విశ్లేషిస్తే్త ప్రధానంగా దిల్లీ లిక్కర్ కేసులో కెసిఆర్ తనయ కవిత ఇరుక్కోవడం..అంతేకాకుండా ఒక సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని బిజెపి నేతలే స్వయంగా వెల్లడిచండం, రాష్ట్రంలో బిజెపి క్రమంగా వెనుకబడడం, కాంగ్రెస్ పుంజుకోవడం వంటి కారణాలతో పరిస్థితులకనుగుణంగా వ్యూహాలను మార్చడంలో దిట్ట అయిన కెసిఆర్ తన పంథాను మార్చుకుని బిజెపిని విమర్శించడం మాని కాంగ్రెస్‌పై వాయిస్ పెంచారు.
అలాగే బిజెపికి కర్నాటక ఓటమి తర్వాత దాదాపు తెలంగాణలోనూ అధికారంలోకి వొచ్చే అవకాశం దాదాపు మూసుకుపోడంతో జాతీయ స్థాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి తగినట్లుగా ఇటీవల మంత్రి కెటిఆర్ దిల్లీలోనే మూడు రోజులు మకాం వేసి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం, ఇరు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగడంతో పార్టీ అగ్ర నేత కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ చివరి నిముషంలో రద్దు చేసుకోవడం, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు దిల్లీ లిక్కర్ కేసులో కవితపై చర్యల ఊసే లేకపోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా సిఎం కెసిఆర్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించే బండిని సంజయ్‌ను పక్కకు జరిపి, కెసిఆర్ పట్ల తవ్ర వ్యతిరేకతను కనపరచడనే పేరున్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తున్నారనే వార్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిఆర్ఎస్, బిజెపి అవగాహనకు వొచ్చాయన్న వార్తలకు నిస్సందేహంగా బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతే కదా..పరిస్థితిని బట్టి ఒక్కోసారి శత్రువుకు శత్రువు కూడా మిత్రుడు కావడం సాధారణమే.




