మెదక్లో ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మహిళలు, చిన్నారులు ఎలాంటి వేదనకు గురికాకుండా ప్రభుత్వ యంత్రాంగంగా తామున్నామని తెలిపేది భరోసా కేంద్రమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ.2 కోట్లతో మెదక్లో నిర్మించిన భరోసా కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ..భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశం మహిళలు, పిల్లలపై ఎలాంటి లైంగిక దాడికి గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసుకునీ వైద్యం అందించాలన్నారు. అలాగే కేసు నమోదు అయినప్పుడు ఆర్థిక సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. చివరగా జడ్జిమెంట్ వొచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని చెప్పారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 135 కేసులు నమోదు అయ్యాయని, వారికి సుమారు రూ.27 లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం చేశామన్నారు. మహిళలు, పిల్లలు ఎలాంటి మానసిక వేదనకు గురికాకుండా కాపాడే విధంగా ఈ భరోసా సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. భరోసా కేంద్రాలు రాని జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.





