ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ కుటుంబాన్ని విచారించాలి

బిఆర్‌ఎస్‌ గుర్తింపును ఈసీ వెంటనే రద్దు చేయాలి
పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారిని
కఠినంగా శిక్షించాలి…ఉన్నతస్థాయి దర్యాప్తు సాగాలి
గవర్నర్‌ను కలిసి దర్యాప్తు కోసం విన్నవిస్తాం
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రమైన అంశమని, ఇది రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకున్న కెసిఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఇది అషామాషీ కేసు కాదని..కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్‌ఎస్‌ వ్యవహరించిందని మండిపడ్డారు. పౌరుల  హక్కులకు బీఆర్‌ఎస్‌ భంగం కలిగించదన్నారు. రాజకీయపరమైన లబ్ది కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు.  దుబ్బాక, మునుగోడు బైపోల్‌ టైమ్‌లో కూడా ట్యాపింగ్‌ జరిగిందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.  పారిశ్రామికవేత్తలు,  ప్రముఖల  ఫోన్లు కూడా ట్యాప్‌ అయ్యాయని కిషన్‌ రెడ్డి చెప్పారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఆంశంపై మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఇందులో నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈసీ రూల్స్‌ను కేసీఆర్‌ బ్రేక్‌ చేశారని ఆరోపించారు. దీనిపై ఈసీ బాధ్యత కూడా ఉందన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని కోర్టు కూడా సుమోటోగా స్వీకరించాలన్నారు.

పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ ఎజెండాగా పెట్టుకుందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం కరెక్ట్‌ కాదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసిన పార్టీలు మారాలన్నారు. పార్టీ ఫిరాయింపులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను బిఆర్‌ఎస్‌  ప్రభుత్వం హరించివేసిందని ఆయన ఆరోపించారు.  ఇందులో కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈసీ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి, బీఆర్‌ఎస్‌ గుర్తుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతలకు చెందిన ఫోన్లను ఇష్టానుసారంగా ఫోన్‌ ట్యాంపింగ్‌ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాలను కారణం ఎవరని..నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లను సైతం ట్యాంపింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఇప్పుడు విచారణలో బయటపడుతుందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయన్నారు. దేశ భద్రత, సమగ్రతకు ముడి పడిన అంశమన్నారు. కేంద్ర హోమ్‌ శాఖ కార్యదర్శి లిఖిత పూర్వకమైన అనుమతి తీసుకునే ట్యాప్‌ చేయాలని చెప్పారు. నేషనల్‌ ఇంటిగ్రిటీకి సంబంధించి ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు అందజేసి, అతను దేశ విద్రోహ శక్తులకు పాల్పడుతున్నట్లు అనుమానం ఉందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు హోమ్‌ శాఖ కార్యదర్శికి పంపిన తర్వాతే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలని తెలిపారు. కానీ వీటిని ఎక్కడా పాటించకుండా, చట్టాలను గౌరవించకుండా గత ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్గించడమే అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా కోరతానన్నారు. ఇందులో ఎవరు ఉన్నా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *