ఫోటో ఎగ్జిబిషన్‌కు పరిమితమైన కేంద్ర పరిశీలక బృందం

  • గోదావరి వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం  
  • బాధిత కుటుంబానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి
  • విలేఖరుల సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య డిమాండ్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : గోదావరి వరదను అంచనా వేసేందుకు భద్రాచలం వొచ్చిన కేంద్ర పరిశీలన బృందం కేవలం ఐటిడిఏలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ‌చూసి వెళ్ళిపోయారని, గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కునటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షులు, భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య విమర్శించారు. శనివారం నాడు తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వరద ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం భద్రాచల ప్రాంత పర్యటన చేసిన సెంట్రల్‌ ‌కమిటీ సభ్యులు కేవలం ఐటిడిఏ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీని మాత్రమే చూసి వరద అంచనాకు వొచ్చి ఎటువంటి నియోజకవర్గ పర్యటన గాని, మండలాల పర్యటన గాని లేకుండా వెను తిరగటం తీవ్ర బాధాకరమని అన్నారు. హడావిడిగా భద్రాచల పర్యటనకు వొచ్చిన రవాణా శాఖ మంత్రి  దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి వెళ్లి తను వంతుగా ప్రత్యేకంగా ఎటువంటి సాయం అందించకుండా వెనుతిరగటం పట్ల వీరు కేవలం పబ్లిసిటీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ పక్షాన తాము వరద బాధితులందరికీ కుటుంబానికి 25 వేల రూపాయలు సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా వారిస్తున్న పదివేల రూపాయలు కూడా అన్ని బాధిత కుటుంబాలకు అందట్లేదని బాధితులు అందరూ విన్నవించుకుంటుంటే పట్టించుకునే నాథుడే భద్రాచలంలో లేకపోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. మూడు సంవత్సరాల నుండి ఎన్నోసార్లు ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలుపుట పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా కేవలం ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఐదు గ్రామ పంచాయతీల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం కూడా మంత్రుల పర్యటనలు కానీ సెంట్రల్‌ ‌కమిటీల పర్యటనలకు సంబంధించిన అంశాలు కూడా తమ దృష్టికి తీసుకు రాకుండా, తమకు తెలియజేయకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ తమని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుందని అన్నారు.

భద్రాచలం పట్టణంలో ముంపు ప్రాంతాలన్నీ రిసర్వే చేయించి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం నుండి ఇచ్చే సాయాన్ని అందించవలసిందిగా ఆయన డిమాండ్‌ ‌చేసారు. శుక్రవారం రాత్రి కూడా అకస్మాత్తుగా పెరిగినటువంటి గోదావరి ప్రవాహం వలన భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీలో ఇల్లు మునిగి నీటిమయం అవడంలో మానవ తప్పిదం మాత్రమే ఉన్నట్టు కనిపిస్తున్నదని, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారని విధితమవుతుందని అన్నారు. తాను ఇన్ని రోజులు భద్రాచలంలో ఉండి స్వయంగా పర్యవేక్షించానంటూ చెబుతున్న జిల్లా మంత్రి కనీసం పునరావాస కేంద్రాల్లో సరైన భోజన సదుపాయం కూడా కల్పించలేకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూపిస్తుందని విమర్శించారు. మరో మూడు నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని తెలియజేస్తున్న తరుణంలో మరల వరదలు వొచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయవలసిందిగా ఆయన డిమాండ్‌ ‌చేసారు. కనీసం రెండు రోజుల ముందే వరదను అంచనా వేసి మధ్యమాల ద్వారా, పత్రిక ప్రకటనల ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయటం ఈ సమయంలో అవసరమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *