ఫెడరల్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి!

కొత్తగా కొన్ని రాష్టాల్ల్రోనూ..కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న తరుణంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలి. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం మూసపద్దతిలో కాకుండా దేశం పురోగమించే దిశగా ప్రణాళికలతో ముందుకు సాగాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అధికా జనాభా, జిఎస్టీ వంటి సమస్యలను ప్రధానంగా తలకెత్తుకోవాలి. ఇందుకు కార్యాచరణ సిద్ధం  చేయాలి. కొత్త ప్రధాని రాష్ట్రాల  సిఎంలను విశ్వాసంలోకి తీసుకుని ముందుకు సాగాలి. కలిసి పని చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించాలి. తమ పార్టీ అధికారంలో లేదన్న కారణాలతో  రాష్టాల్రను చిన్నతనం చేయరాదు. ఇలా చేయడం అన్నది ప్రజలను అవమానించడమే అవుతుంది. అలాగే దేశంలోను, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ,ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. దేశాన్ని రాష్ట్రాలను  ఆర్థికంగా బలోపేతం చేయడం మరచి ప్రజలకు ఉన్న డబ్బులకు తోడు లక్షల కోట్లలో అప్పులు చేసి పందేరం చేయడం, ఖాతాల్లో నగదు బదిలీ చేయడం ఆగిపోవాలి.

రాజకీయాలు వేరు..అభివృద్ధి  వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా హుందాగా ఉండాలి. రాజకీయాల్లో వ్యక్తిగత విద్వేషాలకు తావు ఉండరాదు.. గుదిబండగా మారిన పథకాలను ఎప్పటికైనా సవిూక్షించి  అందుకు తగు నిర్ణయం తీసుకోవాలి. నిరంతరాయంగా డబ్బుల పందేరం లేదా పథకాలో డబ్బులు పంచడంతో వోట్ల్లు పొందాలన్న ఎత్తుగడలను ఇక ఎంతమాత్రం కొనసాగించరాదు. ఈ డబ్బుల పందేరాన్ని అభివృద్దిగా చూపి ప్రచారం చేసుకోవడం కూడా సరికాదు.  కులగణన అన్నది కులాల కుంపట్లు రగిలించడం ఖాయం. కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా గణన జరగాలి. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం కాక మరోటి కాదు. రాజకీయ పార్టీలన్నీ ఈ సార్వత్రిక బిసిల ఎజెండా అంటూ వల్లె వేసాయి. ఏ కులం అయినా జాబితాలో మరచిపోయామా అని దివిటీ పెట్టి వెతుకుతున్నాయి. జగన్‌ కూడా సంక్షేమం, అభివృద్దిని జోడిరచి డబ్బులను నేరుగా ఖాతాల్లో జమ చేయడమే అన్న విశ్లేషన ఇచ్చారు. అదే పనిగా పందేరం పథకాలకు పెద్దపీట వేస్తూ వొచ్చారు. డబ్బులు పంచడమే అభివృద్ది అన్న నినాదం ఎత్తుకున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఈ విషయంలో ఇకనైనా తీరు మారాలి. ఎపిలో ఎవరు అధికారం చేపట్టినా ఈ డబ్బుల పందేరంపై ఆంక్షలు విధించాల్సిందే.

మౌళిక సదుపాయాలు కల్పించడం, సౌకర్యాలు కల్పించడం, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడం ముఖ్యం కావాలి. అభివృద్ధి నమూనా మారకుంటే రాష్ట్రం అధోగతి పాలుకకాక తప్పదు. ఈ విషయాలను గుర్తించి ప్రాంతీయ పార్టీలు పాలన సాగించాలి. అలాగే ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల సౌకర్యాలను, అవసరాలను గుర్తించి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. అప్పుల భారం పెరుగుతున్న క్రమంలో ఉచితపథకాలను తగ్గించుకోవడం ద్వారా ప్రజలపై భారం పడకుండా చూడాలి. తాగు,సాగునీటితో పాటు, విద్యుత్‌, రోడ్డు వసతులను సంపూర్ణంగా అభివృద్ది చేయాలి. విద్యా వైద్య రంగాలకు కేటాయింపులు పెంచి వసతులను మెరుగు పరచాలి. నిరుద్యోగ సమస్య మొత్తంగా పరిష్కరించకున్నా ఉపాధి అవకాశాలను పెంచాలి. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు..రాజకీయ పోరాటాలు వేరని గుర్తించాలి. రాష్టాల్రకు సంబంధించి అనేక సమస్యలను ఎప్పుడూ నిలదీయడంలోనూ వెనకడుగు వేయరాదు. పార్టీలు వేరయినంత మాత్రాన దేశం వేరు కాదన్న విషయం ఆయా రాష్ట్రాల  సిఎంలు కూడా గమనించాలి. అలాగే కేంద్ర రాష్టాల్ర మధ్య ఉన్న అధికారిక సంబంధాలు వేరు. కేంద్రం కూడా పెద్దతరహాలో రాష్ట్రాలను  విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే కేంద్ర రాష్టాల్ర మధ్య బంధం బలోపేతం అవుతుంది.

ఇదే సందర్భంలో తాజాగా మారిన రాజకీయాల క్రమంలో ఆయా రాష్ట్రాల  ఆర్థిక  స్థితి  పైనా నీతి ఆయోగ్‌ ద్వారా హెచ్చరికలు చేయడం మంచిదే. ఫెడరల్‌ వ్యవస్థలో సిఎంలు ప్రధానిని ,కేంద్ర మంత్రులను, కేంద్ర అధికారులను కలవడం సర్వసాధారణం. ఇదే సందర్భంలో కేంద్ర రాష్ట్రాల  మధ్య పన్నుల విధానంలో పారదర్శకత ఉండాలి. జిఎస్టీ విషయంలో ప్రధానంగా చర్చించాలి. ఏయే రంగాలు కదులేవుతున్నదీ చర్చించాలి. రాష్ట్రాల  అభివృద్దితోనే దేశం అభివృద్ది చెందగలదన్న విశ్వాసంతో కేంద్రం ముందుకు సాగాలి. అవినీతి విషయంలో కూడా ఎవరు చేసినా చట్టబద్దంగా శిక్షకు గురి కావాల్సిందే. ఇందులో బెదిరింపు రాజకీయాలకు తావుండరాదు. ఇకపోతే పలు పెండిరగ్‌ ప్రాజెక్టులు, జిఎస్టీ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రంతో సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడం సిఎంల కర్తవ్యం. ఇవన్నీ కూడా పాలనలో భాగం కావాలి. ఓ వైపు రాష్ట్రాల  అభవృద్దికి కేంద్రం సహకరిస్తూనే..దేశం పురోగమించేలా చేయూతను ఇవ్వాలి. సమిష్టి కృషికి ఈ కొత్త ప్రభుత్వం ఆదర్శం కావాల్సి ఉంది.
-ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *