- కంపెనీని బెంగళూరుకు మార్చాలని కంపెనీకి డికె శివకుమార్ లేఖ
- కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందనేదానికి ఇది చిన్న ఉదాహరణ
- బిఆర్ఎస్ ప్రభుత్వంలో అరుదైన సమతుల్యత
- దేశానికే మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం పరుగులు
- మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి
- వాటిని పటాపంచాలు చేసిన ధీటైన నాయకుడు సిఎం కెసిఆర్
- తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ…కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాయడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తుందని, చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని, మనం కష్టపడి నాలుగేండ్లు వెంబడి పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నామని కెటిఆర్ వివరించారు. వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్‌లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్‌కు వొచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి ఫ్యాక్టరీ పెడుతామని ప్రకటించారని వివరించారు. ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారని, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకొలాన్‌లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారని, రెండు అంతస్తులు పూర్తయ్యాయని, వొచ్చే ఏప్రిల్, మే నెలలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుందని కేటీఆర్ తెలిపారు.
అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబర్ 25న ఆపిల్ ఎయిర్ పొడ్స్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చండని లేఖ రాశారని, అన్నారు. తొందరల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని, హైదరాబాద్ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తామని, ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని డీకే శివకుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతదనే దానికి ఇది ఒక చిన్న ఉదహరణ అంటూ వ్యాఖ్యానించారు కెటిఆర్. దిల్లీ చేతికి మన జుట్టు ఇస్తే కొట్లాడే మొనగాడు, తెలంగాణ ప్రజయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే పరిస్థితి ఇలానే తయారవుతుందన్నారు. కాంగ్రెస్‌కు బెంగళూరు అడ్డా అయిపోయిందని, ఇవాళ కాంగ్రెస్ టికెట్లు దిల్లీలో కాకుండా, బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయని, పైసలన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయని, సిద్ధారమయ్య, డీకే శివకుమార్ కష్టపడి సంపాదించిన పైసలు తెలంగాణకు తరలుతున్నాయని, అడ్డంగా దొరికిపోతున్నాయని కెటిఆర్ ఆరోపించారు. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే..లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ పరిశ్రమను బంద్ చేసి బెంగళూరుకు తరలిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కేసీఆర్ సర్కార్‌లో అరుదైన సమతుల్యత కనబడుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు.. ఆర్థిక పరిస్థితి ఏందో అని కొన్ని వర్గాల్లో ఆందోళన, అపోహాలు, అనుమానాలు, ఉండేవని అన్నారు. కాని నాటి పరిస్థితి, నేటి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని, హైదరాబాద్ మహానగరం ఎలా మారిందో అందరికీ తెలుసునన్నారు. కరెంట్, సాగు, తాగు నీటి పరిస్థితులు, వైద్యం, విద్యాసంస్థలు ఇలా చెబుతూ పోతే.. ప్రతి రంగంలో గణనీయమైన గుణాత్మకమైన మార్పు వొచ్చిందన్నారు. మన తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డప్పుడు లక్షా 14 వేలు ఉండెనని, ఇప్పుడు 3 లక్షల 17 వేలకు చేరిందన్నారు. తెలంగాణ వాళ్లకుకు పరిపాలన చేయడం వొచ్చా..? అని వెక్కరించిన వారిని కంగు తినిపిస్తూ మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సవి•కృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అన్నారు. పదాలు బాగున్నాయిని వాడటం లేదని, తెలంగాణలో జరుగుతున్న సమతుల్య మోడల్ ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఇమేజ్ ఉండేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వొచ్చిన తర్వాత ఆయనను ప్రో పూర్, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్ అన్నారని, కానీ ఇవాళ కేసీఆర్ సర్కార్‌లో అరుదైన సమతుల్యత కనబడుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని, నేడు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పండించే స్థాయికి ఎదిగామని, తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు.
ఇక 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉండెనని, ఇవాళ్ళ అది 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగిందని, హైదరాబాద్, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించామని, ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణలో 10 లక్షలకు చేరుకుందని కెటిఆర్ తెలిపారు. ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఐటీని అభివృద్ధి చేశామని, పరిశ్రమలు పెరుగుతున్నాయని, పర్యావరణం పెరుగుతుందని అన్నారు. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచామని, గ్రీన్ బడ్జెట్ పెట్టి, చట్టాలు చేసి చెట్లు కాపాడాలని ఆదేశించాం. ఉద్యోగాలు పోతాయని హెచ్చరించాం. భవిష్యత్ తరాల కోసం హరితాన్ని పెంచే ప్రయత్నం చేశాం. పర్యావరణహితంగా ఉండే పరిశ్రమలను ఎంకరేజ్ చేశాం. 24 వేల పరిశ్రమలు వచ్చాయి. లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఆ విధంగా రూరల్ డెలవప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఐటీ, వెల్ఫేర్.. ఈ అరుదైన సమతుల్యత కనబడేది మన తెలంగాణలోనే మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు.




