‌ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

  • కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి
  • సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్‌, ‌సభ్యులు
  • 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా
  • మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.  ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సీఎం కేసీఆర్‌ ‌సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. సాయన్న నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు. ఆయన వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేసుకున్నారన్నారు. సాయన్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రి అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్‌ ‌జీహెచ్‌ఎం‌సీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్‌ ‌ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది.

ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. సాయన్న నిజామాబాద్‌ ‌జిల్లాలో జన్మించారని, హైదరాబాద్‌ ‌జీహెచ్‌ఎం‌సీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు. వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించిందన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తరవాత ఎంఐఎం, కాంగ్రెస్‌, ఇతర సభ్యులు సాయన్నతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేశారు. మంత్రి వేముల ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ..నిజామాబాద్‌లో జన్మించిన సాయన్న హైదరాబాద్‌లో సెటిలయ్యారని, రాజకీయంగా పరిణతి చెందిన నేతగా ఎదిగారని అన్నారు. తనతండ్రితో సాయన్నకు మంచి పరిచయం ఉందన్నారు. ఏ పననైనా చిటికెలో చేసేవారని గుర్తు చేశారు. మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్‌ ‌తదితర  సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ..ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు.

సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అసెంబ్లీ నేటికి వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, ‌రఘునందనరావు, గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ ‌హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూఢంచల భద్రత ఏర్పాటు చేశారు. ధర్నాలు రాస్తారోకోలు, నిరసనలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లాంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో పలు పార్టీ నేతలు అసెంబ్లీ ముట్టడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 1000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్‌ – 2 అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో లా అండ్‌ ఆర్డర్‌, ‌టాస్క్ ‌ఫోర్స్, ఇం‌టిలిజెన్స్, ‌స్పెషల్‌ ‌బ్రాంచ్‌, ‌పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు బిఎసి సమావేశంలో నిర్ణయించారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు చర్చించారు. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ భేటీలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే పని దినాలు కాదు, పని గంటలపై చూడాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని నిర్ణయించారు. సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. శుక్రవారం వరదలు, శనివారం పలు బిల్లులపై చర్చించనున్నారు. శుక్రవారం వరదలపై చర్చ, 5న బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. ఆదివారం 6న సమావేశాలు ముగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *