- అడ్డుకోకుంటే అసలకే మోసం
- రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం
- ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
- మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 : అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎమ్‌బికి అప్పగించే కుట్ర జరుగుతుందని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…జాతీయ ప్రాజెక్టు తెస్తామని దిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఉన్న ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని సూచించారు. కెఆర్‌ఎమ్‌బికి అప్పగించాలన్న నిర్ణయాన్ని గతంలో తాము వ్యతిరేకించామన్నారు. కెఆర్ఎమ్బితో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తాము వాదించామని, అపెక్స్ కమిటీకి అప్పగించాలని తాము గట్టిగా చెప్పామన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసే సమయంలోనే ప్రణాళిక సంఘం కొన్ని షరతులు పెట్టిందని, శ్రీశైలంలో 830 అడుగుల నీటిమట్టం నిర్వహించాలని సూచించిందన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై గతంలో తమ ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టిందని హరీష్ రావు వివరించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డు పరిధిలోకి వెళతాయనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. లేదంటే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడాల్సి వొస్తుందని అభిప్రాయ పడ్డారు. కేఆర్ఎంబీకి సంబంధించి గతంలో తమపై కూడా ఒత్తిడి వొచ్చిందని ఆయన గుర్తుచేశారు. 264 మెగా వాట్స్ విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి చేసి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని తాము కోరామని వివరించారు.
ఆ సూచనలు పాటించకుంటే ప్రాజెక్టులు విలీనం చేయమని తేల్చి చెప్పామని వివరించారు. కెఆర్‌ఎమ్‌బికి ప్రాజెక్టులు అప్పగిస్తే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందని హరీష్ రావు అన్నారు. హైడల్ పవర్ జనరేషన్లో స్వయం ప్రతిపత్తిని కోల్పోతామని వివరించారు. సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల కోసం అడగాల్సిన పరిస్థితి వొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ గతంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని హరీష్ రావు గుర్తుచేశారు.
ఏడు మండలాలు ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పక్క రాష్ట్రానికి అప్పగించారని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాయని విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా గోదావరి డెల్టాకు నీటిని తరలిస్తే సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని తెలిపారు. ప్రాజెక్టులు కెఆర్‌ఎమ్‌బి చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీరు తెచ్చుకోవచ్చని హరీష్ రావు సూచించారు. గోదావరిలో 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని వివరించారు. ఆ నీటిని లిఫ్ట్ చేసి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు. కాళేశ్వరం పంప్ హౌజుల్లో మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నడుపుతున్నారని తెలిపారు. దీని వల్ల మోటార్లు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని మోటార్లు నడపాలని సూచించారు.





