‌ప్రభుత్వంపై ఆరోపణలకు సమాధానమేది?

  • విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ప్రధాని ప్రసంగం
  • తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

చెన్నై, ఫిబ్రవరి 14 : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే స్వయంగా అంగీకరించారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ బదులివ్వకుండా ప్రధాని అద్భుతంగా ప్రసంగించారంటూ స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ‘’గత కొంతకాలంగా మోదీ , భాజపా  ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటి గురించి ప్రధాని నుంచి స్పందనా లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ గ్రూప్‌  ‌వివాదాలపై ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ప్రజల విశ్వాసమే తనకు సురక్షా కవచం అని ప్రధాని చెప్పారు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’’ అని స్టాలిన్‌ ‌విమర్శించారు. ఇక, ప్రతిపక్షాలను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌) ఏకం చేస్తోందన్న ప్రధాని వ్యాఖ్యలపై స్టాలిన్‌ ‌స్పందిస్తూ.. మోదీపై ఘాటు విమర్శలు చేశారు. ‘’ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నామని ప్రధాని మోదీనే తొలిసారి పార్లమెంట్‌లో అంగీకరించారు. ఇలాంటి రాజకీయ సిద్ధాంతాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. దేశానికి ఎలాంటి మేలు చేయవు’’ అని స్టాలిన్‌ ‌మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించడం గురించి కూడా స్టాలిన్‌ ‌స్పందించారు. రికార్డుల నుంచి ఆ పదాలను తీసేసినంత మాత్రాన.. ప్రజల ఆలోచనల్లో నుంచి వాటిని తుడిచేయలేరని అన్నారు.

బడ్జెట్‌ ‌సమావేశాల్లో భాగంగా ఇటీవల పార్లమెంట్‌లో ప్రసంగించిన ప్రధాని.. విపక్షాలపై ప్రతిదాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘’ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఈ రోజు విపక్ష నేతలంతా ఏకతాటికి వచ్చారు. ఎన్నికల్లో ఓటములు ఇలాంటి వారందర్నీ ఏకం చేస్తాయని భావించాను. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈడీ కారణంగా అందరూ ఒక్కచోటుకు చేరారు. అందుకు ఈడీ కి వారు ధన్యవాదాలు తెలపాలి. ఓటర్లు చేయలేని పనిని ఈడీ చేసి చూపింది’’ అని మోదీ దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్‌ ‌తాజాగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *