‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా దుయ్యబట్టిన విషయం విధితమే! ఇప్పుడు తాజాగా మరో బహిరంగ ఉత్తరం విడుదల చేసారు! తనను ప్రభుత్వం మానసికంగా వేధిస్తున్నదని, గత ఎనిమిదేళ్లుగా తన ఫోన్‌ను ట్యాపింగ్‌ ‌చేస్తూ అందరిని దూరం చేసి పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖలో! తెలంగాణ తన శ్వాస అని, తెలంగాణ ప్రజలే తన కంచుకోట అని చెప్పుకున్నారు! ఆ లేఖ యథాతథంగా పాఠకుల కోసం..

పెనం నుంచి పొయ్యి లోకి….
‘‘నేను డాక్టర్‌తో మాట్లాడాలనుకున్నాను. కానీ ఫోనులో మాట్లాడలేని పరిస్థితి ! నా జన్మదినం నాడు నా మిత్రుడు నాకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు.  కానీ, ఫోనులో వినరాని పరిస్థితి! నా సోదరుడు నాకో విషాదవార్త చెప్పాలనుకున్నాడు. కానీ, అతడు చెప్పేది నేను ఫోనులో వినలేని పరిస్థితి! ఒక పెద్దాయన మా ఇంటికి రావాలనుకున్నాడు. అతను ఆ విషయాన్ని ఫోనులో చెపుతుంటే నేను వినలేని పరిస్థితి! తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య ఆధునిక హంగులతో నిర్మించిన ‘‘ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌’’ ‌నుండే ఇంటెలిజెన్స్ ‌డిపార్ట్‌మెంట్‌  ‌తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తున్నది. వారికెందుకో నేను కూడా టార్గెట్‌గా మారాను. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా దాన్ని అడ్డుకోవడం, లేకుంటే అవతలి వాళ్ళు మాట్లాడేది నాకు వినబడకుండా చేయడం, వాళ్ళకు దినచర్య అయింది.

2014 నుండి నా ఫోన్‌ ‌ట్యాపింగ్‌కు గురి అయినా, ప్రత్యేకంగా 2018 జనవరి నుండి నా ఫోన్‌ ‌కాల్స్‌ను వాళ్లు అడ్డుకోవడం ప్రారంభించారు. గత ఐదున్నర సంవత్సరాల నుండి నాకు నరకం చూపిస్తున్నారు. ఈ లోకంతో నా సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచి వేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని వాట్స్ఆప్‌ ‌మెసేజ్‌ల ద్వారా, అలాగే ఒకటి-రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసి కెటిఆర్‌కు నా ఆవేదనను తెలుపుకున్నాను. ఆయన నా ముందు కొన్ని తీపికబుర్లు చెప్పి, వెనుక తన నాటకాలను కొనసాగిస్తూనే ఉన్నాడు! గత ఐదున్నర యేళ్లుగా నేనెక్కడికి వెళ్లలేని, ఏమీ చెయ్యలేని పరిస్థితికి నన్ను గురి చేస్తూనే ఉన్నారు. అయినా దాన్నంతా నేను నిశ్శబ్దంగానే భరించాను. ఈ విధంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకెంతకూ అర్ధం కావడం లేదు. నేను గత 60 సంవత్సరాలుగా తెలంగాణా సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న్నాను. వందలాది మంది కళాకారులతో సామాజిక అభ్యున్నతి కొరకు జరిగే అనేకానేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. వాటిని చిత్రీకరించే, అక్షరబద్దం చేసే ప్రయత్నం చేశాను, ఇంకనూ చేస్తూనే ఉన్నాను.

నా సాంస్కృతిక రంగం, మరియు సినిమా రంగ కార్యక్రమాలు సమాజ పురోగతికి, తెలంగాణా విమోచనకు తోడ్పడ్డాయే గాని, మరోరకంగా కాదు. ఆంధ్ర పాలకులుకూడా నన్ను ఏనాడూ, ఏ రకంగానూ నిలువరించలేదు. నేటి మన తెలంగాణ పాలకులు మాత్రం నన్ను ఇంత దారుణంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, కాలర్‌ ఎగర వేస్తున్నారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మబలికేలా చూపెట్టే గుప్పెడు మంది ఇంద్రజాలికులను తనచుట్టూ ఒక కోటరీగా ఏర్పాటు చేసుకుని తెలంగాణా ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది ఈ ప్రభుత్వం. నిత్యం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ, ఆత్మగౌరావాన్ని అంగటి సరుకుగా మార్చి, తమని ధిక్కరించిన ప్రతివాన్ని పావలాకు ఆఠానాకు కొనేసి, తన గడీలచుట్టూ పహారా కాసే కాపలా కుక్కలుగా నియమించ చూస్తున్నది. కాదన్న నాలాంటి వారిపై ఇలాంటి దాష్టికాలకు ఒడిగడుతున్నదీ ప్రభుత్వం.
తెలంగాణ వచ్చిందన్న సంతోషం ఏమోగానీ, నాకు మాత్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, ముఖ్యంగా 2018 నుండి అన్ని రాత్రులూ అమావాస్య రాత్రులే! ఒక ప్రముఖుడిగా నా పరిస్థితే ఇలా వుంటే, తెలంగాణాలో సామాన్యుడి గతి ఏమవుతుంది?

ఈ పాలకులకు నేడు తెలియాల్సింది ఏమిటంటే, నా తెలంగాణ అణచివేతను ఎన్నటికీ సహించదు. ప్రజావ్యతిరేక పాలనను సాగనివ్వదు. ఈ తెలంగాణా గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డా తిరుగుబాటు దారుడే. నైజాం మెడలు వంచిన ధీరుడు తెలంగాణా రైతు. నిన్న మొన్నటి తెలంగాణా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన అనేకమంది యువకులు, నేడు నా లాంటి వారికి ప్రాణవాయువునందిస్తున్నారు. నన్నుగాని, నా లాంటి ప్రజాస్వామిక వాదులతో తగువు పెట్టుకుంటే, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. తెలంగాణా సాకారం తరువాత నాపై జరిగిన అణిచివేత, తెలంగాణాలో మరెవ్వరిపై జరగడానికి వీలులేదు. నియంతల మెడలు వంచడానికి, తెలంగాణా పొత్తిళ్ళలోంచి ఉద్యమకెరటాలు ఎప్పటికీ ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉంటాయి.  తెలంగాణే శ్వాసగా బ్రతికిన నాకు తెలంగాణా ప్రజలే కంచుకోట’’’’.
– బి. నరసింగ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *