పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు లక్ష రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన మైక్ సెట్, క్రీడా పరికరాలు, కుర్చీలను బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలకు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి ఒక్కో విద్యార్థి పై లక్షా 20 వేల రూపాయల వ్యయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.



