‌ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టు

  • 850 ఎకరాల్లో అభివృద్ధి, విస్తరణ పనులు
  • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం అభివృద్ధి
  • వెయ్యి కోట్లు ఖర్చయినా కేటాయించేందుకు సిద్ధం
  • కొండగట్టు పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడి

జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆలయ వాస్తుశిల్పి ఆనంద్‌ ‌సాయి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొండగట్టు ఆలయ గుట్టపై భాగంలో గల బేతాళ స్వామి, సీతమ్మ కన్నీటి దార, పుష్కరిణి, ఆలయ ప్రధాన ద్వారం తదితర పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంతో పాటు అభివృద్ధి విస్తరణ చేసే ప్లాన్‌ను అధికారులతో కలిసి రెండు గంటలకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు.

భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయత, అభయారణ్యంతో కూడిన కొండగట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్‌ ‌భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించారు. దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాలపై లొకేషన్‌ ‌మ్యాపుతో  సీఎం కేసీఆర్‌ ‌పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకైనా సిద్ధమని సీఎం తెలిపారు.

యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరిగానే అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపతడతామని సీఎ కేసీఆర్‌ అన్నారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మూలవిరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ పనులు సాగాలన్నారు. వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో నిర్ణయించుకోవాలన్నారు. ఏటా లక్షలాది మంది దీక్షాపరులు దీక్ష చేపడతారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశించారు. మంగళవారం, శని, ఆదివారాల్లో రద్దీ సమయాలతో పాటు, హనుమాన్‌ ‌జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడిని తట్టుకునేలా నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం వొస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.

క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వొచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని కోరారు. హనుమాన్‌ ‌జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణ పనులు జరగాలని అన్నారు. కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌, ‌దవాఖాన, బస్టాండు, పార్కింగ్‌ ‌స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్‌ ‌ట్యాంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్‌ ‌స్టేషన్‌, ‌కల్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్‌ ‌కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్‌ ‌సాయికి  సీఎం కేసీఆర్‌ ‌సూచించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటి దాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం సంతులోని లొద్దిలో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి సీఎం చర్చించారు.

గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్‌ అధికారులతో సీఎం ఆరా తీశారు. మిషన్‌ ‌భగీరథ వొచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని సీఎంకు అధికారులు వివరించారు. గుట్ట మీద కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానించాలని సీఎం అధికారులను ప్రజాప్రతినిలను కోరారు. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ ‌వారు నిర్మించి కాటేజ్‌ ‌విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మాస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అందుకు సీఎం గంగుల కమలాకర్‌ను అభినందించారు. కల్యాణ కట్ట దగ్గర పుష్కరిణిలు ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణ కట్ట పుష్కరిణి పక్కపక్కన ఉండటంతో పాటు స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుష్కరిణులు ఏర్పాటు చేయాలన్నారు. కొండగట్టు అంజన్న అభయారణ్యం ప్రాంతం మైసూరు-ఊటి రహదారిలోని నీలగిరి కొండల్లోని బందీపూర్‌ అభయారణ్యం మాదిరి మార్చాలని అటవీశాఖ అధికారి భూపాల్‌ ‌రెడ్డికి సీఎం సూచించారు. స్థల పురాణం పుస్తకాలను ముద్రించాలని, రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు ఉండేలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆధ్యాత్మిక పర్యాటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖ ఎండి మనోహర్‌ ‌రావును సీఎం ఆదేశించారు. ఆలయానికి వొచ్చిన భక్తుల దర్శన విధానాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అదే పద్ధతిలో పునర్నిర్మాణాలను చేపట్టాలన్నారు. మొదటి మూలవిరాట్టును దర్శించుకున్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకల దర్శనం సర్క్యూట్‌ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గుట్ట మీదకి వొచ్చే వివిఐపిల కోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్‌ ‌సూట్‌, ‌వివిఐపి సూట్ల నిర్మాణానాకి సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తుల నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలన్నారు.

రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సప్లై జరిగేలా మిషన్‌ ‌భగీరథ ఫ్లడ్‌ ‌ఫ్లో కెనాల్‌ ‌నుంచి నీటిని తరలించే పనులను తక్షణమే పనులు చేపట్టాలని సీఎం స్మితా సభర్వాల్‌  ‌సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలైతాయన్నారు. అంజనాద్రి పేరుతో వేదపాఠశాలను నిర్మించాలనీ, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను అనేక పర్యటనలు చేపట్టాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్‌, ఇం‌ద్రకరణ్‌ ‌రెడ్డి, గంగుల కమాలకర్‌, ఎం‌పి దివకొండ దామోదర్‌ ‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌, ‌స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ‌తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ‌బాల్క సుమన్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, సంజయ్‌, ‌కె. విద్యాసాగర్‌ ‌రావు, కోరుకంటి చందర్‌, ‌మండలి చీఫ్‌ ‌విప్‌ ‌భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ ఎల్‌ ‌రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ రావు, ఎఫ్‌ ‌డిసి చైర్మన్‌ అనిల్‌ ‌కూర్మాచలం, సివిల్‌ ‌సప్లైస్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌రవీందర్‌ ‌సింగ్‌, ‌డిసిసిబి ఛైర్మన్‌ అల్లోల శ్రీకాంత్‌ ‌రెడ్డి , గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌,  ‌సీఎంఓ అధికారులు భూపాల్‌ ‌రెడ్డి, స్మితా సబర్వాల్‌, ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులు గణపతి రెడ్డి, రవీందర్‌ ‌రావు, మిషన్‌ ‌భగీరథ ఈఎన్సీ కృపాకర్‌ ‌రెడ్డి, కలెక్టర్‌ ‌యాస్మిన్‌ ‌భాషా, ఆలయ స్తపతి ఆనందర్‌ ‌సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ ‌తేజ, బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ వెంకటేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *