ప్రపంచ శాంతికి పునాది మతసామరస్యమే!

ప్రపంచ ముస్లిమ్‌ సమాజంలో నిగూఢంగా దాగి ఉన్న సంస్కృతి, వారసత్వాలను విశ్వవ్యాప్త ఇస్లామ్‌ మతస్తులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే క్రమంలో భాగంగా ప్రముఖ అమెరికన్‌ రచయిత-నిర్మాత జావేద్‌ మహమ్మద్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రతి ఏటా 11 మార్చి రోజున ‘ప్రపంచ ముస్లిమ్‌ సంస్కృతి, శాంతి, చర్చ మరియు ఫిలిమ్‌ దినం’ జరుపుకోవడం 2010 నుంచి ఆనవాయితీగా మారింది.  కళలతో విషయ అవగాహన సులభంగా జరుగుతుందని తలచి, ముస్లిమ్‌ మత సంస్కృతుల పట్ల ప్రపంచ ప్రజలకు తెలియపరచడానికి ఫిలిమ్‌ మాద్యమం అధిక ప్రభావాన్ని చూపడంలో ఉపయోగపడుతుందని వివరించారు. ;

ప్రతిభావంతమైన ముస్లిమ్‌ ఫిలిమ్‌ నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహిస్తూ, సినిమాల ద్వారా మత సంస్కృతులను ఇతరులు ఆకలింపు చేసుకొనుటతో శాంతి నెలకొంటుందని ప్రతిపాదించారు. ఇస్లామిక్‌ కళల్లో చేతి వ్రాత (కాలీగ్రఫీ)కు అధిక ఆదరణ ఉంది. కాలీగ్రఫీ మాద్యమంగా ఖురాన్‌ బోధనలు, అరాబిక్‌ సామెతలను ప్రదర్శిస్తారు. ఇలాంటి అందమైన ఆకర్షణీయమైన ఇస్లామిక్‌ కళాబోధనల పట్ల ముస్లిమ్‌లే కాకుండా ఇతర మతస్తులు కూడా మక్కువ చూపుతారు. ఇస్లామ్‌లోని మత వైవిధ్యాలను, విలక్షణతలను తెరపై చూపడంలో ఆస్కార్‌ ఆవార్డుల విజేతలైన అస్గర్‌ ఫర్హాదీ (‘ఏ సెపరేషన్‌’ సినిమా), మహెర్షాలా అలీ (అరబ్‌ ఇన్‌ అమెరికా) లాంటి అనేక సినీ నిర్మాతలు ముందుకు రావాలని ముస్లిమ్‌ సమాజం కోరుకుంటున్నది.

వైవిధ్యభరిత ఆచార వ్యవహారాలు
భౌగోళికంగా ఇస్లామ్‌ మతంలో ఈస్టర్న్‌ ఏసియా, మిడిల్‌ ఈస్టర్న్‌, అమెరికన్‌ ప్రాంతాల ముస్లిమ్‌ల సంస్కృతి, ఆచార వ్యవహారాలలో కొంత సారూప్యత ఉన్నప్పటికీ, కొన్ని స్పష్టమైన తేడాలు కూడా ఉన్నాయని గమనించారు. మత విశ్వాసాలు, పెద్దల్ని గౌరవించడం, శాంతి భావనల స్థాపన లాంటి ఆచారాలు అంతటా కనిపిస్తాయి. ప్రపంచ ముస్లిమ్‌ల మధ్య నెలకొన్న వ్యత్యాసాలను చెరిపి, సంభాషణలతో సమైక్యతను సాధించి వారందరిని ఏకతాటి పైకి తేవడానికి 11 మార్చి వేదిక పని చేస్తుంది. ఇండోనేషియా, పాకిస్థాన్‌, చైనా, రష్యా, అమెరికా, యూరప్‌ ప్రాంతాలకు చెందిన పలు ముస్లిమ్‌ వర్గాలను ఏకం చేయటానికి కళలు, చలన చిత్ర మాద్యమాలను తీసుకోవడం సముచితమని నమ్ముతున్నారు. ముస్లిమ్‌ల వస్త్రధారణ, ఆహార అలవాట్లు, వివాహ పద్దతులు, ఇతర ఆచారాల మధ్య వ్యత్యాసాలను అవగాహన పరుచుకోవడం, ఐక్యత సాధించడం జరగాలి. ఇస్లామ్‌ మతంలోని ముఖ్యమైన ఐదు విశ్వాసాలైన రోజు ఐదుసార్లు ప్రార్థనలు, ‘అల్లాప్‌ా’ను ఏకైక దేవుడిగా పూజించడం, ఆదాయంలో కొంత భాగం దానం చేయడం, మక్కా సందర్శన, రంజాన్‌ ఉపవాసాలు పాటించడం లాంటివి అన్ని వర్గాల ముస్లిమ్‌లకు వర్తిస్తాయి.

ఐక్యతకు అవసరం అవగాహన
‘ముస్లిమ్‌’ అంటే ‘దేవుడికి సమర్పణ (సబ్‌మిషన్‌ టు గాడ్‌)’ అని, ‘ఇస్లామ్‌’ అంటే ‘లొంగిపోవడం (సరెండర్‌)’ అని అర్థం చేసుకోవాలి. ప్రపంచ మతాల్లో 2వ అతి పెద్ద మతంగా ఇస్లామ్‌కు పేరుంది. ప్రవక్త (ప్రోహఫెట్‌), గాడ్‌ మధ్య జరిగిన సంభాషణగా ‘ఖురాన్‌’ను గుర్తిస్తారు. షియా, సున్నీ వర్గాలుగా ఇస్లామ్‌ మతస్తులు విడిపోయి ఉన్నారు. 11 మార్చి రోజున నిర్వహించే ప్రపంచ సంస్కృతి, శాంతి, సంభాషణ, ఫిలిమ్‌ దినోత్సవంలో విద్యాసంస్థలు, పౌర సమాజ కేంద్రాలు, ప్రార్థనామందిరాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ఫలితంగా ముస్లిమ్‌లు ఐక్యత సాధించడం, ఇతర మతస్తుల్లో పరమత సహనం పెరుగుతాయి. ప్రపంచమే కుగ్రామమైన వేళ శాంతియుత సహజీవనమే ప్రగతికి పుణాది అని నమ్ముతూ, మతం కన్న మానవత్వం మిన్న అని ప్రచారం చేద్దాం.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *