భారతదేశంలో 1920 సంవత్సరంలో ముప్పుతిప్పలు పెట్టిన ముసర వ్యాధి (రిండర్ పెస్ట్) ప్రపంచ దేశాలకు పాకింది. అపార పశు నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం చర్చించటానికి 43 దేశాల ప్రతినిధులతో ‘‘పశు మహామారుల అంతర్జాతీయ సదస్సు’’ జరిగింది. జంతువులకు వచ్చే అంటువ్యాధులను ఎదుర్కొనటానికి, ఆ స్పందనలను సమన్వయ పరచటానికి ఒక అంతర్జాతీయ సంస్థ అవసరాన్ని సదస్యులు అర్థం చేసుకున్నరు. ఫలితంగా 1924 జనవరి 25న ‘‘ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎపిజువాటిక్స్’’ (ఓఐఈ) పురుడు పోసుకున్నది.
జంతు మహామారుల నివారణ, వ్యాప్తిని అరికట్టుట దీని ప్రధాన లక్ష్యం. పారిస్ నగరం కేంద్ర స్థానం. 1927 మార్చ్ 8న డే రూ ను అధ్యక్షుడుగా, ఎమ్మాన్యుయేల్ లెక్లేంచి ని డైరెక్టర్ జనరల్ గా తీసుకొన్నరు. ఓఐఈ ప్రపంచవ్యాప్తంగా తగిన భరోసా కల్పించటానికి 1928లో ఇంటర్నేషనల్ సానిటరీ పోలీస్ వ్యవస్థకు పునాది వేసింది. ఇది ఐక్యరాజ్య సమితి కంటె ముందుగా ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ 45 అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు నెరపుతున్నది. ప్రతి ఖండంలో ప్రాంతీయ, ఉపప్రాంతీయ కార్యాలయాలు కలిగి ఉన్నది. 1990 నుంచి స్ట్రాటజిక్ ప్లాన్స్ అనే పంచవర్ష ప్రణాళికలను తయారు చేస్తున్నది.
ప్రస్తుతం 7 వ ప్రణాళిక కాలం (2021-2025) నడుస్తున్నది. ఈ సంస్థ కృషి వల్ల 2011 నాటికి ముసర వ్యాధి నిర్మూలన జరిగింది. చాలా వ్యాధులను అరికట్ట కలుగుతున్నము. మారుతున్న పరిస్థితులను బట్టి లక్ష్యాలను విస్తరించి, పేరును 2003 మే లో ‘‘వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆనిమల్ హెల్త్’’ గ మార్చుకొన్నరు. అయినా ఓఐఈ అనే పొడి అక్షరాలను 2022 మే దాకా అట్లానే కొనసాగించినరు. దీని ప్రస్తుత అధ్యక్షుడు హ్యూగో ఇడొయాగ బెనిటెజ్, డైరెక్టర్ జెనరల్ శ్రీమతి మోనిక్ ఎలియట్. ప్రస్తుతం డబ్ల్యూఓఏఎచ్ లో 183 దేశాలకు సభ్యత్వం ఉన్నది. సభ్య దేశాలు తమ ప్రాంతంలో సంభవించిన జంతు వ్యాధులను ఎప్పటికప్పుడు సంస్థకు తెలియ చేస్తయి.
సంస్థ ఆ విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, దాని నివారణ చర్యలు, చికిత్స, శాస్త్ర సాంకేతిక మద్దతు, మనుషులకు సోకే ఆస్కారం వంటి అంశాలను జోడిరచి ప్రపంచ దేశాలకు పంచుతుంది. మార్గదర్శనం చేస్తుంది. జంతువులు, జంతు సంబంధ ఉత్పత్తుల అంతర్జాతీయ వర్తకం కోసం ఆరోగ్య ప్రమాణాలను నిర్ధారిస్తుంది. వ్యాధుల చికిత్స నిర్ధారణ నివారణ నిర్మూలనలో నూతన ధోరణులు, ఔషధ వినియోగ సర్వేక్షణ, ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తదితర అంశాల మీద బులెటిన్స్, మాన్యువల్స్ ప్రచురిస్తున్నది. పశు వైద్యులకు కళాశాలలో చదువని కొత్త విషయాలను నేర్పుతున్నది.
భారత్ డబ్ల్యూఓఏఎచ్ తో సమిష్టిగా పని చేస్తున్నది. భారత ప్రతినిధిగా పశు సంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ వ్యవహరిస్తున్నరు. 2023 నవంబర్ లో జరిగిన సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కమిషన్ 33వ కాన్ఫరెన్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
ప్రపంచంలో 18 శాతం ప్రజలు పశుపాలన లేదా జంతు సంబంధ ఆహార తయారీ, విక్రయాల మీద ఆధారపడి ఉన్నరు. కోట్లాది మంది ఉపాధి, జీవన స్థాయి జంతువుల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఆహారం కోసం జంతువులపై ఆధార పడుతున్నరు. మనిషికి జంతుజాలం నుంచి, జంతుసంబంధ ఆహారం నుంచి అనేక వ్యాధులు సంక్రమిస్తున్నయి. కోవిడ్-19, బర్డ్ ఫ్లూ, నిపాప్ా వంటి ఎన్నో వ్యాధులు జంతువుల ద్వారా సోకిన విషయం మనకు తెలుసు. జంతువుల ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం పరస్పర ఆధారితాలు. మనుషులకు మచ్చిక అయిన జంతువులు, వన్య ప్రాణులు, భూచర జలచర జంతువులు అన్నింటి వ్యాధుల నివారణకు, చికిత్సకు డబ్ల్యుఓఏఎచ్ కృషి చేస్తున్నది. జంతువుల ఆరోగ్యం సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థగా డబ్ల్యూఓఏఎచ్ నిలిచింది. డబ్ల్యూఓఏఎచ్ కు ఇది శతాబ్ది!
-డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211
(వ్యాసకర్త ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)




