‌ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యం

  • అధికారం, ప్రధాని పదవులపై మాకు ఆసక్తి లేదు
  • అందుకే విపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం
  • విపక్షాల భేటీలో ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  • ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ

బెంగళూరు, జూలై 18 : కాంగ్రెస్‌ ‌పార్టీకి కేంద్రంలో అధికారంపై కాని, ప్రధాని పదవిపై కాని ఆసక్తి లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే మంగళవారం ప్రకటించారు. తాము మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి దేశానికి మేలు చేయాలన్న సంకల్పంతో మాత్రమే విపక్షాల ఐక్యతకు పాటుపడుతున్నామని అన్నారు. మంగళవారం బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం రెండవ రోజున ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదని స్పష్టం చేశారు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అవి సిద్దాంతపరమైనవి కావని ఆయన చెప్పారు. ఇక ప్రతిపక్షాల సమావేశానికి మొత్తం 26 పార్టీలు హాజరయ్యాయి.

గత నెల పాట్నాలో మొదటిసారి సమావేశమైన ప్రతిపక్షాలు మలి సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించుకుంటున్నాయి. సోమవారం రాత్రి విందు సమావేశంతో మొదటి రోజు సమావేశం ముగిసింది. మంగళవారం సమావేశంలో వొచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఐక్యంగా బిజెపిని ఎదుర్కునడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. బెంగళూరు సమావేశాలలో కాంగ్రెస్‌తోపాటు టిఎంసి, డిఎంకె, ఆప్‌, ‌జెడియు, ఆర్‌జెడి, జెఎంఎం, ఎన్‌సిపి(శరద్‌ ‌పవార్‌ ‌గ్రూపు), శివసేన(ఉద్ధవ్‌ ‌థాక్రే గ్రూపు), సమాజ్‌వాది పార్టీ, రాష్టీయ్ర లోక్‌ ‌దళ్‌, అప్నా దళ్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌(‌లిబరేషన్‌), ఆర్‌ఎస్‌పి, ఆల్‌ ఇం‌డియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌, ఎం‌డిఎంకె, విసికె, కెఎండికె, ఎంఎంకె, ఐయుఎంఎల్‌, ‌కేరళ కాంగ్రెస్‌(ఎం), ‌కేరళ కాంగ్రెస్‌(‌జోసెఫ్‌) ‌పాల్గొంటున్నాయి.

ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ
విపక్షాలన్నీ కలిసి చేస్తున్న పోరాటం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై యుద్ధమని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పోరాటం కేవలం బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, దేశ ప్రజల గొంతుక అణచివేతపై చేస్తున్న పోరాటంగా భావించాలని అన్నారు. మన దేశ భావ జాలం మరియు నరేంద్ర మోదీ మధ్య పోరాటమని, ఐఎన్‌డిఐఏ మరియు ఎన్‌డిఏ మధ్య పోరాటం దేశ భావజాల పరిరక్షణ కోసం చేస్తున్న యుద్ధమని, దీనితో ఎవరూ పోరాడలేరని, గత చరిత్రను పరిశీలిస్తే అది అర్థమవుతుందని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *